28 April, 2026 | 12:21 AM

శాంతిఖనిలో కలకలం రేపిన కార్మికుడి ఆత్మహత్య యత్నం

27-04-2026 09:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): శాంతిఖని బొగ్గు గనిలో అధికారుల వేధింపులు పేట్రేగిపోయాయి. ఇటీవల గనిలో అధికారులు కక్ష సాధింపు చర్యలు శృతి మించిపోయాయి. ఓ కార్మికుడిని అధికారులు షిఫ్ట్ మార్పు చేశారు. జనరల్ షిఫ్ట్ లో పనిచేస్తున్న మాధవ్ అనే మల్టీ జాబ్ వర్కర్  అధికారుల వేధింపులను భరించలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాధవ్ అనే కార్మికుడు చాలాకాలంగా జనరల్ షిఫ్ట్ లో పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు గనిలో స్వల్ప ప్రమాదం జరిగింది.

ఈ ఈ ఘటనలో గాయపడిన  మాధవ్ ను అధికారులు సస్పెండ్ కూడా చేశారు. అప్పటినుంచి సదరు కార్మికుడిని అధికారులు వేధిస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం జర్నలల్ షిఫ్టు  నుంచి మార్చి వేశారు. కక్ష సాధింపు చర్యలపై మాధవ్ అధికారులపై తిరగబడడమే ఆయన చేసిన పెద్ద నేరం అయింది. జర్నర్ షిఫ్టుకు మార్చాలని ఆయన  అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ అధికారులు కనికరించలేదు. తాను ఏం తప్పు చేశానని, షిఫ్ట్ మార్పు చేశారని ఆ కార్మికుడు అధికారులను నిలదీశాడు. షిఫ్ట్ మార్చే ప్రసక్తి లేదని అధికారులు ముందుగా సమాధానం ఇవ్వడంతో, మాధవ్ మొదటి షిఫ్ట్ లో కార్మికుల సమక్షంలో నే అధికారుల తీరుపై మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

వాటర్ బాటిల్ లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను పోసుకొని సూసైడ్ కు ప్రయత్నించగా అక్కడే ఉన్న కార్మికులు ఆయనను నిలువరింప చేశారు. ఈ సంఘటన తో కార్మికులు తీవ్ర షాక్ గురయ్యారు. తోటి కార్మికులు మాధవ్ ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఆయన ప్రాణం దక్కింది. అయినప్పటికీ అధికారులు అతన్ని ఎప్పటి వలె జనరల్ షిఫ్ట్  కు మార్చాలని కార్మికులు ఒత్తిడి చేశారు. అయినప్పటికీ అధికారులు కనికరించక షిఫ్ట్ మార్పుపై మొండికెత్తి కూర్చున్నారు. శాంతిగని కార్మికులను పట్టి పీడిస్తున్న ఆ ముగ్గురు అధికారుల తీరుపై కార్మిక సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల వేధింపులకు తాళలేక మాధవ్ అనే కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ కార్మిక సంఘాల్లో కాసింత చలనం కలగకపోవడం చర్చనీయాంశంగా మారింది.