18-09-2025 07:52:16 PM
అదిలాబాద్ (విజయక్రాంతి): గత ఏడు రోజులుగా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకొని కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన సంక్షేమ శాఖ అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్టు లేకపోవడం కార్మికుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. గురువారం సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో డైలీ వేజ్ ఔట్సోర్సింగ్, కాంటినిజెంట్ పేర్లతో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని అన్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా ఇచ్చే అరకొర వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచుతున్నదని పేర్కొన్నారు.
గత 6 నెలలుగా వేతనాలను చెల్లించకపోతే కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని గిరిజన శాఖ అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఏకకాలంలో పెండింగ్లో ఉన్న వేతనాలను కార్మికుల ఖాతాలో జమ చేయాలని, కార్మికులు ఇదివరకే తీసుకుంటున్న వేతనాలను తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 64 ను వెంటనే రద్దు చేయాలన్నారు. అధికారులు వెంటనే రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్యచరణ రూపొందించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అసెంబ్లీని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, జిల్లా నాయకులు ఆత్రం సోనేరావ్, వెంకట్రావు, కైలాష్, కపిల్ తదితరులు పాల్గొన్నారు.