20 March, 2026 | 12:59 PM

ఒకే గది.. రెండు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ

20-03-2026 11:22 AM

తికమక పడుతున్న ప్రజలు. 

తాండూరు,(విజయక్రాంతి): ఓకే గదిలో రెండు వేరువేరు ప్రభుత్వ శాఖల కార్యాలయ నిర్వహణతో ప్రజలు తికమక పడుతున్నారు. వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు పట్టణంలో శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వం భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station)తో పాటు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఒకే హాల్ లో కొనసాగుతున్నాయి.  దీంతో కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చే ప్రజలు ఓకే ప్రధాన ద్వారం ద్వారా కార్యాలయం లోపలికి వచ్చాక సీన్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇదివరకు ఎక్సైజ్ కార్యాలయం ఓ ప్రైవేటు అద్దె భవనంలో కొనసాగేది ఇటీవల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోకి కార్యాలయాన్ని మార్చారు. ఓ గంజాయి కేసులో విలేకరుల సమావేశానికి వెళ్లిన విలేకరులు సైతం అక్కడి పరిస్థితిని చూసి అవక్కయ్యారు. రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్ని ఇచ్చే  ఆప్కారి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.