18-09-2025 07:50:41 PM
ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ..
దౌల్తాబాద్ (విజయక్రాంతి): పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ అన్నారు. మండల పరిధిలోని ముబారాస్ పూర్ గ్రామంలో రెండవ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భంలోని శిశువు ఎదుగుదల నుంచి శిశువు జన్మించే వరకు ఆ తరువాత పెరుగుతున్న పిల్లలకు తగినంత పోషకాహారం అందిస్తే ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందజేస్తున్నామన్నారు.
అయినప్పటికీ కొన్ని కుటుంబాలు వీటిని అందిపుచ్చుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ పిల్లలకు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. రోజువారీ కూలీలుగా పనిచేసే కుటుంబాలు పోషణ విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇటువంటి కుటుంబాలకు పోషణ మాసోత్సవాల్లో పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత, అంగన్వాడి టీచర్ వసంత తదితరులున్నారు.