5 August, 2026 | 2:42 AM

దేశాయ్ బీడీ కంపెనీని దుద్దెడకు తరలించొద్దంటూ కార్మికుల నిరాహార దీక్ష

05-08-2026 01:48 AM

బచ్చన్నపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి) :  గత 40 సంవత్సరాలుగా బచ్చన్నపేటలో కొనసాగుతున్న దేశాయ్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీడీ  కంపెనీని. దుద్దెడకు గ్రామానికి తరలించవద్దని డిమాండ్ చేస్తూ కార్మికులు మంగళవారం రిలే నిరాహార దీక్షను చేపట్టారు. కంపెనీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాల ఉపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, సుమారు 800 మంది బీడీ కార్మికులు, 20 మంది ప్యాకింగ్ కార్మికులు ఈ కంపెనీపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.

కంపెనీని ఇతర ప్రాంతానికి తరలిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు దశాబ్దాలుగా బచ్చన్నపేటలో కొనసాగుతున్న కంపెనీని యథాతథంగా ఇక్కడే కొనసాగించాలని, కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కంపెనీ తరలింపును నిలిపివేయాలని కోరారు.ఈ రిలే నిరాహార దీక్షలో ప్యాకింగ్ సెక్షన్ కార్మికులు  నర్రా రవీందర్ రెడ్డి, దమ్ము మహేందర్ రెడ్డి, నక్కల దుర్గారెడ్డి రాగిరు కనకయ్య.పోచంపల్లి శ్రీనివాస్, నర్రా సురేందర్ రెడ్డి, మేక యాదగిరి, వంగ మల్లారెడ్డి, మార్క సంతోష్ కృష్ణమూర్తి  పాల్గొన్నారు.