calender_icon.png 13 February, 2026 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన కార్మికుల సమ్మె

13-02-2026 12:04:50 AM

నూతనకల్, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన దేశ సార్వత్రిక సమ్మె నూతనకల్లో ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కార్మిక రంగం అత్యంత కీలకమైనదని, కానీ మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాల విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లేబర్ కోడ్లను ప్రభుత్వం బలవంతంగా అమలు చేయడం సరికాదని, వీటి వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్న ఈ నూతన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

లేబర్ కోడ్ల రద్దుకు భారీ ర్యాలీ

మునుగోడు, ఫిబ్రవరి 12 : కార్మికులకు మరణ శాసనంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనితెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం 2025లో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలు ప్రజా వ్యతి రేకమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కర్షకులపై దుష్ప్రభావం చూపే చట్టాలు తీసుకువస్తోందని విమర్శించారు.  ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమా లను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,సాగర్ల మల్లేష్, బెల్లం శివయ్య, వరికుప్పల ముత్యాలు, బండమీది యాదయ్య,దుబ్బ వెంకన్న,యాసరాని శ్రీను,పందుల చిన్న నరసింహ,రెడ్డిమల్ల యాదగిరి, వెంకన్న పాల్గొన్నారు.