13-02-2026 12:00:00 AM
తంగళ్ళపల్లి,ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి ): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిరసనలో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కనీస వేతనాలు పెంచాలని, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని తెలిపారు.దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 90 వేల మందికి పైగా కార్మికులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని నాయకులు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టడంలో 2005లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.సంవత్సరానికి రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరముండగా, కేవలం రూ.85 వేల కోట్లతోనే కొనసాగించడం వల్ల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలనే ప్రతిపాదన రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోందని, తెలుగు రాష్ట్రాలపై సుమారు రూ.2,900 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి, కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు గుంటి వేణు, మీసం లక్ష్మణ్, బాచుపల్లి శంకర్, రాజేందర్, బాలయ్య, రాములు, మల్లయ్య, శంకర్, ఆనందు, రవి, నరసయ్య, గోవిందు తదితరులు పాల్గొన్నారు.