calender_icon.png 16 November, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

16-11-2025 12:00:00 AM

-ఫిష్ మార్కెట్‌లు ఏర్పాటు చేస్తాం

-రాష్ట్రంలో మత్స్య విప్లవాన్ని తెస్తున్నాం

-మంత్రి వాకిటి శ్రీహరి

-హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మరో మంత్రి పొన్నంతో కలిసి 3 లక్షల చేప పిల్లలు వదలిన శ్రీహరి

హుస్నాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత్స్య సంపదను పెం పొందించడం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగాన్ని కీలకంగా మారుస్తున్నామని పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

శనివారం ఆయన మరో మంత్రి పొన్నం ప్రభా కర్‌తో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో రూ. 5.17 లక్షల విలువైన 3 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో ఈ సంవత్సరం 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదులుతున్నట్టు చెప్పారు.

ఈ బృహత్తర కార్యక్ర మానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 123 కోట్లు కేటాయించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మత్స్య సంపదపై రాష్ట్రంలో సుమా రు 5 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారి అభివృ ద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.గతంలో చేప పిల్లల పంపిణీలో అవక తవకలు జరిగాయనే ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి పూర్తి పారదర్శకత కోసం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఏ చెరువులో, ఏ సైజులో, ఎన్ని చేప పిల్లలను విడుదల చేశారనే వివరాలు స్పష్టంగా తెలిపేలా చెరువుల వద్ద సైన్ బోర్డులను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి కేంద్రాలను గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంతో పాటు, అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.5 లక్షల బీమా కల్పిస్తున్నామన్నారు.

దీంతో పాటు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 3 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌టెట్లను అందించినట్టు తెలిపారు. గుర్తించిన మత్స్యకారు లకు రూ.1.40 కోట్లతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చినట్టు చెప్పారు. గురుకులాల్లో మటన్, చికెన్ లాగా చేపలు కూడా మెనూ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు, హుస్నాబాద్‌లో పశువైద్యశాల ఆధునీకరణ, అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్ నిర్మాణం పూర్తి చేయడం, స్టోరేజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి  శ్రీహరి హామీ ఇచ్చారు. 

 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు. కాగా  హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నియోజకవర్గం మొత్తం మీద 165 చెరువులకు గాను 38.92 లక్షల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనుండగా, దీనివల్ల 4,144 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.