calender_icon.png 11 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు

11-11-2025 01:31:03 AM

ప్రభుత్వ భూములు కాపాడాలంటూ విన్నపాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి) : నగరంలో పార్కుల రూపురేఖలు మారిపోతున్నాయని, చెరువుల విస్తీర్ణం పెరిగి తమ నివాసాలు మునిగిపోతున్నాయని ఆరోపిస్తూ పలువురు నగరవాసులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. లేఅవుట్‌లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేసి, వాటిలో ఆలయాలు, షెడ్లు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ సోమవారం జరిగిన హైడ్రా ప్రజావాణిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, రావిర్యాలలోని తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో మందిరాలు, షెడ్లు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అలాగే, ముషీరాబాద్ నియోజకవర్గం, బాగ్‌లింగంపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 1300 గజాల చిల్డ్రన్స్ పార్కును కబ్జా చేసి, స్టీల్, ఐరన్ దుకాణాలు, సర్వీసింగ్ సెంటర్లు నడుపుతున్నారని, జీహెఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు, రంగారెడ్డి జిల్లా రావిర్యాల చెరువుల విస్తీర్ణం ఏటా పెరిగిపోయి, ఎగువన ఉన్న తమ ప్లాట్లు, ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని బాధితులు వాపోయారు. మొత్తం 47 ఫిర్యాదులు అంద గా, వాటిని హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్ స్వీకరించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.