03-12-2025 12:28:36 AM
-17 మంది విద్యార్థులకు అస్వస్థత
-ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
-గద్వాల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఘటన
గద్వాల, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి, 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్‌లో ఉప్మాలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం పురుగులు పడిన ఉప్మా తిన్న తర్వాత హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లిన 17 మంది విద్యార్థుల్లో కొందరు ప్రేయర్ చేస్తుండగా, మరికొందరు తరగతి గదిలో కళ్లు తిరిగి కింద పడిపోయారు.
ఉపాధ్యాయులు హుటాహుటిన జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. 15 మంది విద్యార్థులకు ప్రథ మ చికిత్స అందించగా, ఇద్దరు విద్యార్థులకు ఐసీయూలో చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. టిఫిన్‌లో పురుగులు రావడంతో ప్రత్యామ్నాయంగా బిస్కెట్, అరటిపండు ఇవ్వడంతో కొందరు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారని తెలిపారు.
హాస్టల్‌లో విద్యార్థుల మెనూ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్ అప్రమత్తంగా ఉండి ఉప్మా రవ్వను పరిశీలించినట్లయితే ఈ సమస్య తలెత్తేదికాదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అస్వస్థకు గురైన విద్యా ర్థులను మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత హాస్పిటల్‌లో పరామర్శించారు.