calender_icon.png 29 October, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధంలో వనదుర్గమ్మ..

29-10-2025 02:10:22 PM

ఏడుపాయల్లో మళ్లీ మంజీరా పరవళ్ళు

ఆలయం మూసివేత

రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు

రాజగోపురంలోనే వన దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

పాపన్నపేట,(విజయక్రాంతి): వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాజెక్టు ఎగువ నుంచి వరద వస్తుండడంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వరదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ ఉదృతంగా ప్రవహిస్తుంది.

వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేయడంతో ముందు జాగ్రత్తగా బుధవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.