02-08-2025 01:30:47 AM
నల్లగొండ, ఆగస్టు 1 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటు యూనిట్-౧ను జాతికి అంకింతం చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటో యూనిట్‌ను ప్రారంభించారు.
రూ.970 కోట్లతో వైటీపీఎస్ ఆవరణలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని అన్ని యూనిట్లను పూర్తిచేసి 2026. జనవరి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అందుకు అనుగుణంగా నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పని చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోపు అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటిపీఎస్ అధికారులు పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలని సూచించారు. సంవత్సరంలోనే స్టేజ్-1లోని రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
డిసెంబరులోగా అన్ని యూనిట్లను పూర్తి చేసి జనవరి 1, 2026 నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేలా పని చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రోటోకాల్‌ను పాటించాలని, అంతేకాక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని అన్ని సౌకర్యాలు బాగున్నాయనే విధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రులు నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు.
పవర్ ప్లాంట్ ఆవరణలోని డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ను పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చేలా ఆసుపత్రి నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. లారీలతో రోడ్లు దెబ్బతిన్నందున సీసీ రోడ్లను మంజూరు చేశామని, యుద్ధ ప్రాతిపదికన సీసీరోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని,ఇందుకు సంబంధించి నష్టపరిహారం, భూసేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
గత ప్రభుత్వం వల్లే రెండేండ్లు ఆలస్యం: భట్టి
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రెండేండ్లు వైటీపీఎస్ పనులు ఆలస్యమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. యూని ట్-1 ను జాతికి అంకితం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులకు సంబంధించి క్లియరెన్స్ తీసుకురాలేకపోవడం వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పన చేస్తున్నా మని వివరించారు. పులిచింతల కింద చిట్యాల మండలంలో నష్టపోయిన రైతులకు కూడా ఉద్యోగాలు, పరిహారం అందజేస్తున్నామన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దేశిత సమయానికి అనుగుణంగా కార్యాచరణ ప్రకార ం పనులు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ యూనిట్ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ కట్టిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు అయ్యిందన్నారు. అయితే ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు. 93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే పనులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుండి ఎలాంటి సహకారం అందించడం లేదని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్ రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్‌ఆర్ డైరెక్టర్ వి.కుమార్ రాజు పాల్గొన్నారు