02-08-2025 01:31:18 AM
మేడ్చల్, ఆగస్టు 1 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంకు తొలిరోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లాలో 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉండేందుకు ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ ఆర్ ఎస్) ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలు పెట్టింది.
మొదటిరోజు ప్రతి టీచర్ ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజే ప్రారంభం కావడంతో రద్దీ ఏర్పడింది. దీంతో ఉదయం చాలాసేపు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమేపి మెరుగుపడింది. టీచర్లు లాగిన్ కావడంతో విద్యార్థుల సర్వర్ డౌన్ అయింది. దీంతో విద్యార్థుల హాజరు శాతం పడిపోయింది. ఇది గమనించి వెంటనే టెక్నికల్ సిబ్బంది సరి చేశారు. ఎఫ్ ఆర్ ఎస్ పూర్తికావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.
డుమ్మాలకు చెక్
విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూలు, అన్ని రకాల గురుకుల పాఠశాలలో ఎఫ్ ఆర్ ఎస్ అమలు కానుంది. ఈ పద్ధతి వల్ల టీచర్ల డుమ్మా లకు చెక్ పడనుంది. టీచర్లు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారని, పాఠశాలలకు రాకున్నా హాజరు పడుతుందని సంబంధిత అధికారులు గుర్తించారు.
కొంతమంది యూనియన్ లీడర్లమని చాలా రోజులు విధులకు హాజరు కావడం లేదు. విధులకు హాజరు కాకుండా, సెలవు పెట్టకుండా హాజరు పట్టికలో సంతకాలు చేస్తున్నారు. ఎఫ్ ఆర్ ఎస్ విధానంతో డుమ్మాలు కొట్టేఅవకాశంఉండదు.