18 July, 2026 | 3:46 AM

యడ్డీ అనామకుడేం కాదు

15-06-2024 01:40 AM
  1. యడియూరప్పకు అరెస్టు చేయాల్సిన అవసరమేంటి?

పోక్సో కేసులో కర్ణాటక హైకోర్టు ప్రశ్నలు

మాజీ సీఎంను అరెస్టు చేయొద్దని ఆదేశాలు

బెంగళూరు, జూన్ 14: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. యడ్డీని ఈ నెల 17వ తేదీవరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ట్రయల్ కోర్టు యడియూరప్పపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేయటంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

దీంతో గురువారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన జస్టిస్ ఎస్ క్రిష్ణ దీక్షిత్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన టామ్, డిక్, హ్యారీ (అనామకుడు) ఏమీ కాదు కదా పారిపోవటానికి? ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు నుంచి తప్పించుకొనేందుకు దేశం విడిచి పారిపోతారా?’ అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ నెల 17వ తేదీవరకు యడియూరప్పను అరెస్టు చేయవద్దని ఆదేశిం చింది. 17వ తేదీన ట్రయల్ కోర్టు ఈ కేసును మరోసారి విచారించనున్నది.