రామ హృదయ కలశాన్ని స్పర్శించిన యోగి ఆదిత్యనాథ్
ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి దివ్య ఆశీస్సులతో బయలుదేరిన గురు పాదుకా యాత్ర అయోధ్యకు చేరుకుంది. శ్రీ శ్రీశ్రీ త్రిదండి అహోబిళ జీయర్ స్వామి వారి ఆజ్ఞ మేరకు సంస్కార్ వికాస్ భాగ్యనగర్ కో ఆర్డినేటర్ బైలుర్ యోగీష్ ప్రభు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి పవిత్రమైన శ్రీ రామ హృ దయ కలశాన్ని అందించారు. యోగి ఆదిత్యనాథ్ భక్తిపూర్వకంగా కలశాన్ని స్పర్శించారు.
ఈ నెల 26న అయోధ్యలో నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవానికి, అక్టోబర్ 11న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)లో జరిగే గురు ప్రదక్షిణ మహోత్సవానికి హాజరు కావాలని యోగి ఆదిత్యనాథ్ను ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ రామ హృదయ కలశాన్ని అందించిన శ్రీ కలిదిండి విశ్వనాథ్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రత్యేక ఆశీర్వచనాలు అందించిన ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ శ్రీ ఈశ్వర సుఖేష్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.






