అదే నీవు అదే నేను.. మనసా మనసా..
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అదే నీవు అదే నేను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మనసా మనసా..’ పాటను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాంఛ్ చేశారు.
‘ఎన్నెన్నె ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా.. నువు లేని వెలితేదో మిగిలున్నదే.. ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే.. మారిందే వరసా.. నీకైన తెలుసా.. ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే.. బంగారు సొగసా.. నీ లేత స్పర్శ ఎన్నెన్నో మాటల్ని చెబుతున్నదే.. తుళ్లిపడకే మనసా మనసా.. అంటూ సాగుతోందీ గీతం. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క స్వరపర్చిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించగా, జావెద్ అలీ పాడారు.
ఈ పాటలో నాయకానాయికలు త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: నిమ్మల జయపాల్ రెడ్డి; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ఆర్ట్: నార్ని శ్రీనివాస్.






