14 July, 2026 | 4:26 AM

ముక్కు మూసుకోవాల్సిందే!

14-07-2026 01:54 AM
  1. అధ్వానంగా ఆమనగల్ బస్టాండ్‌లోని మూత్రశాల
  2. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు 
  3. లక్షల ఆదాయం వస్తున్నా నిర్వహణ శూన్యం
  4. నీళ్లు లేవు.. పరిశుభ్రత లేదు.. 
  5. మహిళలు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం

ఆమనగల్, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధానికి, శ్రీశైలం క్షేత్రానికి మధ్య అత్యంత కీలకమైన జంక్షన్గా ఉన్న ఆమనగల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం ప్రయాణికులకు నరకాన్ని తలపిస్తోంది. రోజుకు వందలాది బస్సుల రాకపోకలు, వేలాది మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే ఈ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.

ఆర్టీసీకి లక్షల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్న ఈ కేంద్రంలో, ప్రయాణికుల ప్రాథమిక అ వసరమైన మూత్రశాలల నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు. బస్టాండ్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముక్కుపుటాలవిసిరే దుర్వాసన ప్రయాణికులను స్వాగతిస్తోంది.

నలుమూలల నుంచి బస్సులు..నడిరోడ్డుపై ప్రయాణికులు

 ఆమనగల్లు బస్టాండ్ కు హైదరాబాద్  ఎంజీబీఎస్, బర్కత్పుర, పిక్కెట్, శ్రీశైలం, నల్గొండ, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, షాద్ నగర్, దేవరకొండ, ఇబ్రహీంపట్నం, యాదగిరిగుట్ట, సంగారెడ్డి, మెదక్, మహేశ్వరం వంటి పలు ప్రధాన డిపోల నుంచి నిత్యం వందలాది బస్సులు ఇక్కడికి వస్తుంటాయి.

లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు కాస్త సేదతీరడానికి, వాష్ రూమ్లకు వెళ్లడానికి ఇక్కడ బస్సు దిగుతుంటారు. కానీ, ఇక్కడి వాష్ రూమ్ల పరిస్థితి చూసి ప్రయాణికులు లోపలికి వెళ్లలేక విలవిలలాడుతున్నారు. వాష్ రూమ్స్ లో కంపు.. పట్టించుకోని నాథుడుబస్టాండ్లోని మూత్రశాలలు కంపు కొడుతూ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా మారాయి.

నిర్వహణ శూన్యం..

టాయిలెట్లలో సరిపడా నీటి వసతి లేదు. నీరు లేకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తోంది.నిత్యం వం దలాది మంది వాడుతున్నా, వీటిని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కరువయ్యారు. ఈ కంపు కారణంగా బస్టాండ్ పరిసర ప్రాం తాల్లోని వ్యాపారులు, ప్రయాణికులు అం టువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహిళల ఆత్మగౌరవం దెబ్బతినాలా? 

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అత్యవసరంగా టాయిలెట్కు వెళ్లాలన్నా వెళ్లలేని దుస్థితి దాపురించింది. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల నుంచి ‘స్వచ్ఛ భారత్’ సెస్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు.. కనీసం మహిళల సౌకర్యాలను కూడా పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. కనీస బాధ్యతపై ఏది?

రోజువారీ టికెట్ కలెక్షన్లు, స్టాళ్ల అద్దెల ద్వారా ఆర్టీసీకి భారీగానే ఆదాయం సమకూరుతోంది. కానీ, అందులో పైసా కూడా బస్టాండ్ నిర్వహణకు ఖర్చు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తక్షణమే స్పందించాలి:

ఆమనగల్ బస్టాండ్ సమస్యపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలి. తాత్కాలిక చర్యలు కాకుండా, శాశ్వతంగా నీటి వసతి కల్పించి, నిరంతరం పారిశుద్ధ్య పనులు జరిగేలా చూడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

లోపలికి వెళ్లలేక చస్తున్నాం..

‘దూరం నుంచి బస్సులో వస్తున్నాం. అర్జెంట్ అయి ఇక్కడి టాయిలెట్కి వస్తే కంపు కొడుతోంది.. అస్సలు లోపలికి వెళ్లలేకపోతున్నాం. కాస్తయినా బుద్ది ఉండాలి కదా, గింత ఘోరంగా ఉంచుతారా? ఆడవాళ్లం ఎటు పోవాలి సార్?‘

  సరిత, ప్రయాణికురాలు, సార్లపల్లి

నీళ్లు లేవు.. ఎలా పోవాలి?

బస్టాండ్కు వస్తే ముక్కులు మూసుకోవాల్సి వస్తోంది. టాయిలెట్ల లోపల చూ స్తే కడిగేందుకు చుక్క నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఎలా పోవాలి? ఆడవాళ్ల కష్టాలు పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

 అంజమ్మ, ప్రయాణికురాలు, గట్టిఇప్పలపల్లి