అధికారుల సమస్యలు పరిష్కరించండి
- సింగరేణి యాజమాన్యానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
- అధికార సంఘం నాయకుల హర్షం
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా సింగరేణి అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలుకు సం బంధించి అధికార సంఘం నాయకులు చేసిన విజ్ఞప్తులను ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇటీవల ప్రజాప్రభుత్వం ప్రత్యేక చొరవతో తాడిచర్ల--2 బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడంలో భట్టి విక్రమార్క పోషించిన కీలకపాత్రకు కృతజ్ఞతలు తెలుపుతూ సింగరేణి అధికార సంఘం నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా అధికారులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన భట్టి విక్రమార్క సోమవారం ఉదయం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ప్రజాప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇంధన భద్రతను అందించడంలో సింగరేణి కార్మికులు, అధికారులు విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా వారి సమ స్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలన్నారు. రానున్న రెండు నుంచి మూడు నెలల్లోనే పరిష్కరించాలని తెలిపారు.
సింగరేణి సుస్థిర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచు కొని కొత్త బొగ్గు బ్లాక్ సాధనకు కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సింగరేణి అధికార సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్, ప్రధానకార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంపై వారు డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి అభివృద్ధి, విస్తరణ, సుస్థిర భవిష్యత్ కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అధికారుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.






