29-10-2025 12:00:00 AM
మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ధర్నా
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 28: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని యువతి మృతి చెందిన ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మంచాల మండలం అరుట్ల గ్రామానికి చెందిన పంబాల దుర్గేష్, సంతోష అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన నందిని (19), సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తండ్రి దుర్గేష్, ఇంట్లో తన కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మృతికి గల కారణాలు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం కావడంతో మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠా యించారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి 20 గుంటల భూమి ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా పోస్టు మార్టం, అంత్యక్రియలు జరగనున్నాయి.