07-01-2026 12:50:28 AM
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): వరంగల్ కోట భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ఆ భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించి అప్పగించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరా రు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ లేఖలో పలు అం శాలను ప్రస్తావించారు. ‘దాదాపు 250 ఏండ్లపాటు కాకతీయుల రాజధానిగా కీర్తిగడించి ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో అలరారిన ఓరుగల్లు (వరంగల్) నగరం.. మన వారసత్వ సంపదకు నిలయంగా విరాజిల్లుతోంది.
కాకతీయుల కాలంలో ఇతర రాజ్యాల నుంచి ఎదురయ్యే దండయాత్రల నుంచి రాజధానికి రక్షణ కల్పించడానికి ప్రణాళిక ప్రకారం 7 ప్రాకారాలతో వరంగల్ కోటను పకడ్బందీగా నిర్మించారు. నిత్యం వేలమంది పర్యాటకులు సందర్శించి కోటలో దాగి ఉన్న శిల్ప సంప ద, నిర్మాణ నైపుణ్యం, వందల ఆలయాలు, వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటుంటారు. పర్యాటకులను మ రింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్రం నిరంతరం చర్యలు తీసుకుంటున్నది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోట కు చుట్టూ ఉన్న 7 ప్రాకారాల్లో ప్రస్తుతం మూడు మాత్రమే మిగిలాయి. వీటితోపాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూముల్లో అనేక నిర్మాణాలు చేపట్టారు.
వరంగల్ కోట ఏఎస్‌ఐ అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశమని, దీ నికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, వెంటనే భూము లను ఖాళీ చేయాలని కోరుతూ ఏఎస్‌ఐ అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నో టీసులు ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నేను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గా ఉన్న సమయంలో ఏఎస్‌ఐ అధికారులు 04.11.2022న అలాగే ఇటీవల 01.12.2025న వరంగల్ జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించి, కోట భూములను పరిరక్షించటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు’ అని లేఖలో పేర్కొన్నారు.
రికార్డుల ప్రకారం పురావస్తుశాఖవే..
రెవెన్యూ రికార్డులలో కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవి అని కా కుండా ప్రభుత్వం అని పేర్కొన్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ‘దీంతో ఆక్రమణదారుల పై చర్యలు తీసుకోవడంలో భారత పురావస్తుశాఖకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ఆక్రమణలు మరింత పెరగకుండా, కోట భూములు భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించడానికి ఏఎస్‌ఐ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కోట భూములను పరిశీలించాలని సంబంధిత అధికారులకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరు తూ 15.10.2025న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏఎస్‌ఐ అధికారులు వరంగల్ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు.
కోట చుట్టూ మట్టి గోడ, రాతి గోడ ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొత్త నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఇటీవల మట్టి గోడలోని కొంత భాగాన్ని ఆక్రమించారు. వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేసి, కోట భూముల్లో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించడంలో తగిన సహకారాన్ని అందించి, పురావస్తు శాఖ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్‌ఐ అధికారులు 03.12.2025న కలెక్టర్‌కు మరో లేఖ రాశారు.
2025 నవంబర్‌లో నేను వరంగల్‌లో పర్యటించినప్పుడు ఏఎస్‌ఐ అధికా రులు ఈ విషయాలన్నింటినీ నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి, మీరు ప్రత్యేక చొరవ తీసుకుని, వరంగల్ కోట పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటిని తొలగించడం, ఆక్రమణదారుల నుంచి విడిపించి తిరిగి ఏఎస్‌ఐకి స్వాధీనం చేసి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
భారత పురావస్తుశాఖ చట్టం ప్రకారం, వరంగల్ కోట భూములను ఏఎస్‌ఐకి చెందినవిగా గుర్తించి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది భూ ఆక్రమణ సమస్య పరిష్కరించడం.. అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని, చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణలో ఏఎస్‌ఐకి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.