19-04-2025 06:54:46 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి భవనంపైకి యువతి ఎక్కి హల్ చల్ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.2 లోని తాజ్ కృష్ణ హోటల్ సమీపంలో ఏఐజీ ఆసుపత్రి నూతన భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానంటూ శివలీల అనే యువతి బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే... శివలీల అనే యువతి గత కొన్ని రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆసుపత్రి యాజమాన్యం తనను విధుల నుంచి తెలిగించింది. ఈ నేపథ్యలో మనస్తాపనానికి గురైన శివలీల తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే భవనంపై నుంచి దుకి ఆత్మహత్య చేసుకుంటానంటు బెదిరించింది.
దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. యువతితో పోలీసులు మాట్లాడేందుకు యత్నిస్తుంటే.. యువతి మాత్రం ఎవరైనా తన దగ్గరకు వస్తే భవనం పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ప్రధాన రహదారిపై కావడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు యువతితో ఫోన్ లో మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్న పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కిందకు దిగిరావాలని కోరుతున్నారు.