డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజీలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని "డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం" అనే నినాదంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఖమ్మం ఏసీపీ వై.ఎస్.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో, ఖమ్మం అర్బన్ సీఐ ఆర్. భానుప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, వాటికి దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న మాదక ద్రవ్యాల నిరోధక చర్యలను వివరిస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సీఐ భానుప్రకాశ్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకలాంటివారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కాలేజీ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ పెంపొందిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






