ఈత కారాదు.. కడుపు కోత..
పిల్లల కదలికలను పెద్దవాళ్లు గమనించాలి: ఎస్‌ఐ సూరి
మంగపేట, మే 5 (విజయక్రాంతి): ఒకవైపు ఎండలు మరో వైపు పాఠశాలలకు వేసవి సెలవులు. ఎండాకాలంలో ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి, తోటి వారితో సరదాగా గడపడానికి చిన్నారులు, యువకులు చెరువులు, కుంటలు, బావులు, నదులు తదితర నీటి వనరుల వద్దకు ఈత కోసం వెళ్తుంటారు.
ఈత కొడుతూ సరదాగా గడపాలన్న ఆరాటంతో నీటి ప్రవాహం, నీటిమట్టం (లోతు) వంటి వాటిని సరిగా గుర్తించక పోవడంతో పలు ప్రాంతాలలో చాలా సందర్భాలలో ప్రమాదాలు చోటు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత, కుటుంబాలు వేదనలో ఉంటున్న సంఘటనల గురించి చూస్తూనే వున్నాం. వేసవి సెలవుల్లో చాలా మంది చిన్నారులు, యువకులు సరదాగా ఈత కోసం వెళ్లి మృత్యువాత పడి కన్నవారికి అంతులేని కడుపు కోత, తోటి వారిని జీవితాంతం వెంటాడే విషాద జ్ఞాపకాలు మిగుల్చుతున్నారు. పిల్లలను ఒంటరిగా ఇంటి వద్ద వదిలివేయొద్దు. ఎవరో ఒకరు వారి పట్ల పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూడాలి.
ఈత ఏర్పడానికి పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ముందస్తు ప్రమాద నివారణ కచ్చితంగా తీసుకోవాలి. నీటి ప్రమాదాలకు గురైతే ప్రాణాలను రక్షించుకోవడానికి అవసరమైన ముందస్తు చర్యలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. వేసవిలో పిల్లలు ఇంటిపట్టునే ఆడుకునే విధంగా వివిధ రకాల క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచాలి. సమూహంగా పిల్లలందరినీ ఒకేచోట ఆడుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
పిల్లల కదలికలను పెద్ద వాళ్ళు గమనించాలి..
సెలవుల్లో తల్లిదండ్రులకు తెలిసి చాలా తక్కువ మంది ఈతకు వెళుతుంటారు. ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. అడుతూ పాడుతూ వేసవిలో సరదాగా గడిపే చిన్నారులు ఉత్సాహంగా చెరువులు, కుంటల్లో దిగి మృత్యువాత పడుతున్నారు. బంగారు భవిష్యత్ నీటిపాలు అవుతుంది. చాలామంది పిల్లలు పెద్దవాళ్లకు చెప్పకుండానే తోటి వారితో ఈతకు వెళ్లిపోతుంటారు. ప్రవాహం ఎక్కువగా ఉండే నీటిలో ఈత నేర్చుకోవడం, ఈత కొట్టడం ప్రమాదకరం. పెద్దల పర్యవేక్షణ ఉంటే ప్రమాదాలు జరగవు. సెలవుల్లో పిల్లలు ఎక్కడకు వెళు తున్నారో పెద్దవాళ్లు గమనిస్తూ ఉండాలి. ప్రమాదం జరిగిన తరువాత బాధపడే బదులు ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి.






