16 August, 2026 | 8:33 PM

జపాన్ పర్యటనతో తెలంగాణ విద్యకు కొత్త దిశ

16-08-2026 07:40 PM

అంతర్జాతీయ అనుభవం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేలా మార్గదర్శకంగా నిలవాలి

గరిడేపల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ పర్యటనకు ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ ఎంపికయ్యారు. జపాన్‌లోని విద్యా విధానం, ఆధునిక సాంకేతికత, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను అధ్యయనం చేసి, వాటి ద్వారా పొందిన అనుభవాన్ని తెలంగాణ విద్యా ప్రగతికి ఉపయోగించనున్నారు.

ఈ పర్యటన కేవలం సందర్శన కాకుండా అధ్యయన యాత్రగా కొనసాగనుంది. జపాన్‌లోని బోధనా పద్ధతులు, సాంకేతిక వినియోగం, విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాల పెంపుపై ఆయన అవగాహన పొందనున్నారు. రాజశేఖర్‌ పొందే అంతర్జాతీయ అనుభవం ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగపడేలా మార్గదర్శకంగా నిలవాలని యుటిఎఫ్, పిఆర్టియు, ఎస్టియు నాయకులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ పర్యటన విజయవంతం కావాలని కోరారు.