పటాన్ చెరు గడ్డపై గులాబీ జెండా హోరు
యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్ చెరు గులాబీ దండు
ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో 1200 ల వాహనాల్లో తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పల్లెలు, పట్టణాల నుండి కదం తొక్కిన నిరుద్యోగులు, బిఆర్ఎస్ కార్యకర్తలు
నిరుద్యోగుల గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
యూత్ డిక్లరేషన్ పేరుతో యువత భవిష్యత్తుకు చరమగీతం పాడారు
2028లో ఎగిరేది గులాబీ జెండాయే
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయమంటే ఎండ్రిన్ తాగి చావాలంటూ వ్యాఖ్యలు చేస్తోందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడంతో పాటు 2028 ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగరం ఖాయమని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో 1200 వాహనాల్లో గులాబీ శ్రేణులు బయలుదేరి వెళ్లాయి.
శనివారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పటాన్ చెరు పురవీధుల గుండా ఓఆర్ఆర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్వయానా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ 2023 లో సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓటు కొట్టు.. జాబ్ పట్టు అని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నేడు ఉద్యోగాలు ఏవని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావాలంటూ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ దురాహంకారానికి అర్థం పడుతుందని విమర్శించారు. జాబులు నింపడంలో విఫలమైనా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ కి సుట్ కేసులు పంపడంలో గోల్డ్ మెడల్ సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని.. 2028లో తిరిగి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యువత, విద్యార్థి, నిరుద్యోగులకు సువర్ణ యుగం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.






