కార్యకర్తలే బలం.. బలగం

29-04-2024 01:02:13 AM

కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అండ

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

రుణమాఫీ, రైతుబంధు విషయంలో మోసం చేసింది

బీజేపీ మాకు అసలు పోటీనే కాదు

‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్

సంగారెడ్డి, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమ ని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అండగా ఉంటాయని జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేసిందని, ప్రతి రైతుకు రైతుబంధు కింద ఎకరాకు రూ.10 అందజేసిందని గుర్తుచేశా రు. రైతుబీమాను సైతం అమలుచేసి అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలను ఓడిం చేందుకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఆ వ్యతిరేకతే బీఆర్‌ఎస్ గెలుపునకు దోహదపడుతుందని ‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో గాలి అనిల్‌కుమార్ చెప్పారు.

జహీరాబాద్ పార్లమెంట్‌లో రెండు సార్లు బీఆర్‌ఎస్ విజయం సాధించింది. మరోసారి కైవసం చేసుకుంటుందా?

బీఆర్‌ఎస్ పార్టీకి బలం, బలగం కార్యకర్తలే. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్ల కాలంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అం దించారు. బీఆర్‌ఎస్‌కు జహీరాబాద్ నియోజకవర్గంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. నాయకులు పార్టీ మరినా, కార్యకర్తలు మారలేదు. జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి విజయం సాధిస్తుంది. నియోజకవర్గంలో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. దీనిపై మీ అభిప్రాయం?

బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటే అయితే ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేసి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయించాయి. ప్రజలు అన్నీ చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న నాటకం ఇది. 

బీఆర్‌ఎస్‌లో కొందరు కాంగ్రెస్‌కు కోవర్టులుగా ఉన్నారంట? నిజమేనా?

బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులు ఇప్పుటికే కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు. మోసం చేసేవారికి ప్రజలు తప్పక బుద్ధి చెప్తారు.

బీఆర్‌ఎస్ గ్రామస్థాయిలో ప్రచారం చేయడం లేదంటున్నారు? నిజమేనా?

బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుత్‌స్థాయిలో నాయకులు సమా వేశాలు ఏర్పాటు చేసి గతంలో పార్టీ అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశాం. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలుపించేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తున్నాయి. ఇప్పుటికే జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ శాసనసభ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశాం.

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం?

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన వెం టనే ప్రతి నియోజకవర్గంలో యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కలిపించేందుకు నైపుణ్య శిక్షణ కలిపించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తా. యువకులకు ఆసక్తి ఉన్న వాటిలో శిక్ష ణ కల్పించి ఉపాధి కలిపించేందుకు ప్రయత్నిస్తా. జహీరాబాద్ నిమ్జ్‌లో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలిపించేందుకు కృషి చేస్తా. నిమ్జ్‌లో పారిశ్రమల ఏర్పాటుకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేయడంతో పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పందాలు చేసుకొన్నాయి.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు బీఆర్‌ఎస్ అధినేత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పథకాలను నిలిపివేసింది. ప్రతి ఎకరానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు కృషి చేస్తా.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఎలా ప్రచారం చేస్తారు?

కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో విఫలమైంది. రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోని వచ్చా రు. డిసెంబర్ 9న రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి మోసం చేశారు. రైతుబంధును ఎక రానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోని రాగానే మరిచిపోయారు. కాంగ్రెస్ మహిళలను, యువతను మోసం చేసింది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోని వచ్చి అమలు చేయలేదు. ఆ పార్టీ చేసిన మోసలే బీఆర్‌ఎస్ గెలుపునకు దోహద     పడుతాయి.