స్వాములు, భక్తులకు నిత్యాన్నదానం
నిర్మల్, నవంబర్ 10 ( విజయక్రాంతి) : అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్(All-India Ayyappa Seva Trust) ఆధ్వర్యంలో, నిర్మల్ అయ్యప్ప సేవా సమితి అనుబంధ సంస్థ ద్వారా శబరిమలలోని(Sabarimala) నిలక్కల్ ప్రాంతంలో అయ్యప్ప స్వాములు, భక్తుల(devotees) కోసం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మంగళవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో గురుస్వామి చిన్నయ్య మాట్లాడారు. నవంబర్ 16 నుంచి జనవరి 20 వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.
శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులకు(devotees) ఇబ్బందులు కలగకుండా నిత్యం అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ అన్నదాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 13న పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి నిత్యావసర సరుకులతో కూడిన డీసీఎం వాహనం శబరిమలకు బయలుదేరనున్నట్లు తెలిపారు.
అయ్యప్ప స్వాముల అన్నదాన సేవకు సహకరించాలనుకునే దాతలు తమకు తోచిన విధంగా బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర సరుకులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు నిర్వాహకులను సంప్రదించి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇందులో గురుస్వాములు చేనిగారపు చిన్నయ్య,బద్రి శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు కనపర్తి విఘ్నేష్,జాప ప్రకాష్,సాదం ఆనంద్, వస్త్రాలశివప్రసాద్,మారుతి,తురక శ్రీను,జ్యోతిర్మయన్, తదితరులు ఉన్నారు.