సాలూర సొసైటీని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి

12-11-2026 | 11:13pm

- ​రైతుల సంక్షేమానికి పాలకవర్గం అంకితభావంతో పనిచేయాలి: ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి

- ​అట్టహాసంగా సాలూర సొసైటీ నూతన చైర్మన్ అల్లె రమేష్ ప్రమాణ స్వీకారం

​సాలూర,(విజయక్రాంతి): సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Saloora Primary Agricultural Cooperative Society) నూతన చైర్మన్‌గా అల్లె రమేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గురువారం సాలూర మండల కేంద్రంలోని పెరక సంఘంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి(Bodhan MLA P. Sudarshan Reddy) నూతన చైర్మన్ రమేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. సొసైటీ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు అందేలా చూడాలని పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు. పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో పనిచేసి సాలూర సొసైటీని నిజామాబాద్ జిల్లాలోనే ఆదర్శవంతంగా నిలపాలని ఆకాంక్షించారు.

ఎల్నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని, సాగుకు అనువుగా రైతులకు స్ప్రింకర్లను అందజేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ​అనంతరం నూతన చైర్మన్ అల్లె రమేష్ మాట్లాడుతూ.. తనపై అపార నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, సహకరించిన డైరెక్టర్లు, రైతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సొసైటీని మరింత లాభాల బాటలో నడిపిస్తానని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు