రష్యాలో చిక్కుకున్న వారిపై డీజీపీ ఆరా
నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు వెళ్లినట్లు గుర్తింపు..
రాష్ట్రవ్యాప్తంగా విచారణ
పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవాలి.. రాష్ట్రంలో మావోయిస్టులు లేరు
బోధన్, నవంబర్ 28 (విజయక్రాంతి): రష్యాలో(Russia) చిక్కుకున్న తెలంగాణ యువకుల వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్(State DGP CV Anand) స్పందించారు. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) నుంచి ఇప్పటివరకు నలుగురు రష్యాకు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ(Comprehensive inquiry) చేపడుతున్నామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎంతమంది రష్యాకు వెళ్లారు? వారు ఏ మార్గంలో అక్కడికి చేరుకున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో పనితీరులో వెనుకబడిన పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. నిజామాబాద్ వన్‌టౌన్, త్రీటౌన్, రూరల్, ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ, బోధన్ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మావోయిస్టులు లేరు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టులు ఎవరూ లేరని, అందరూ లొంగిపోయారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేవలం ముగ్గురు మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఎవరూ తెలంగాణకు చెందినవారు కాదని పేర్కొన్నారు. వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవసరమైన అంశాలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.