భర్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష
భార్యను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కోర్టులో నిరూపణ – రెండు కేసుల్లో శిక్ష, జరిమానా విధించిన సెషన్స్ కోర్టు
బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు(Nizamabad Sessions Court) ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సెషన్స్ జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన దుబ్బాక బాలస్వామి, అదే గ్రామానికి చెందిన సబ్బని ఉమా మహేశ్వరి ప్రేమించుకుని 2012 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, కుటుంబ అవసరాల కోసం డబ్బులు కావాలంటూ బాలస్వామి తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడు.
కూతురు పడుతున్న బాధలను చూడలేక ఉమా మహేశ్వరి తల్లి నిర్మల అవసరమైనప్పుడల్లా ఆర్థికంగా సహాయం చేసేది. ఇదిలా ఉండగా, ధర్మారం గ్రామంలో నిర్మలకు ఉన్న ఓపెన్ ప్లాట్‌ను విక్రయించి, అందులో వచ్చే డబ్బుల్లో సగం తనకు ఇచ్చేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కొన్నేళ్లుగా భార్యపై ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేసేవాడు.
భర్త వేధింపులు భరించలేకపోయిన ఉమా మహేశ్వరి 2024 సెప్టెంబర్ 20న ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిపై వచ్చిన అభియోగాలు రుజువు కావడంతో సెషన్స్ జడ్జి బాలస్వామికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
రెండు సెక్షన్ల కింద శిక్షలు, జరిమానాలు
భార్యను క్రూరంగా వేధించినందుకు బీఎన్ఎస్ సెక్షన్ 85 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు బీఎన్ఎస్ సెక్షన్ 108 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు మరో రూ.1,000 జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించని పక్షంలో ఒక్కో సెక్షన్‌కు అదనంగా మూడు నెలల చొప్పున జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బందికి సీపీ అభినందనలు
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఇన్వెస్టిగేషన్ అధికారి మహమ్మద్ షరీఫ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, బ్రీఫింగ్ ఆఫీసర్ ఆరిఫ్, డిచ్పల్లి ఎస్ఐపీ, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్, కోర్టు సీఎంఎస్, సీడీఓ సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.