బొగ్గు బుక్కిన కాంగ్రెసోళ్లు కోల్ మాఫియా!
* పోశమ్మ పొతం చేస్తే, మైసమ్మ మాయం చేసినట్టు.. కేసీఆర్ సింగరేణిని బలోపేతం చేస్తే, కాంగ్రెస్ సర్కారు ఖతం చేసింది.
కేటీఆర్
- సింగరేణిలో కుంభకోణాల కుంభమేళ
- కమీషన్లు పంచుకునేందుకు సంస్థను కొల్లగొడుతున్నరు
- సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్లు బాకీ
- నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణకు కుట్ర
- నైనీ టెండర్లలో ఏమైందో చెప్పాలి
- రూ.10వేల కోట్ల స్కామ్‌పై విచారణ జరపాలి
- కార్మికుల హక్కుల కోసం మరో పోరాటం
- కేసీఆర్ పిలిస్తే ఆనాడు కోల్‌బెల్ట్ మొత్తం కదిలింది
- ‘సింగరేణి కార్మిక గర్జన’లో బీఆర్ఎస్ నేత కేటీఆర్
పెద్దపల్లి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ జీవనాడి సింగరేణి సంస్థను(Singareni Company) కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతూ, కార్మికుల పొట్టకొడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు(K. Taraka Rama Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంస్థను ఆర్థిక సంక్షోభం(Economic crisis)లోకి నెట్టి, కార్మికుల జీవితాలను ఆగం చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన(Singareni Workers' Roar)’ భారీ బహిరంగ సభలో కేటీఆర్(KTR) ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగరేణి సంస్థను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల సంక్షేమాన్ని పక్కనపెట్టి, సంస్థ నిధుల వినియోగం, ఆర్థిక నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సింగరేణి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని కేటీ ఆర్ మండిపడ్డారు. ‘సింగరేణిలో నైనీ కుంభకోణాన్ని అడ్డుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయన్నారు. వాటాలు కుదరక కుంభకోణాలను వారే బయట పెట్టుకుంటున్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ రూల్ పేరిట రూ.10 వేల కోట్ల స్కామ్ జరిగింది. సోలార్, జిలెటిన్ స్టిక్స్‌తోపాటు మరో నాలుగైదు కుంభకోణాలు జరిగాయి.
ఆధారాలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి(Kishan Reddy) లేఖ రాశాం. సింగరేణి కార్మికుల జీవితాలను ఆగం చేస్తున్నారని విచారణ కోరాం. సింగరేణిలో చోరీ జరిగింది.. నువ్వే పట్టుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అంటే దొంగకు చీకటి తోడైంది. ఒకరికొకరు కాపాడుకుని.. కమీషన్లు పంచుకునేందుకు సింగరేణిని కొల్లగొడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. విద్యుత్ వ్యవస్థను రేవంత్ ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. థర్మల్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు ఎందుకు ఇవ్వడం లేదని, ఆ బొగ్గు అంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి(Coal production) సరిగ్గా లేదంటే దానికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కో అంటే కోల్‌బెల్ట్ మొత్తం కదలిందన్నారు. కేసీఆర్(KCR) హయాంలో సింగరేణి ఓ వెలుగు వెలిగిందని ఈ సంస్థ సాయంతోనే రాష్ర్టంలో 24 గంటల కరెంటు ఇవ్వగలిగామన్నారు. తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును గతంలో ఆంధ్ర ప్రాంతానికి తరలించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు కలిసి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంతానికి తరలించారు
. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఆగమైందని, మోసపోతే గొసపడతామని కేసీఆర్(KCR) ఆనాడే చెప్పారన్నారు. సింగరేణిని అవినీతి గనిగా రేవంత్ మారుస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరెంటు కొరత లేదని ఇప్పుడు రాష్ర్టంలో కరెంట్ కట్ సాధారణంగా మారిందన్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం అవినీతి రైజింగ్.. ప్రొడక్షన్ పాలింగ్ అన్న చందంగా పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
సింగరేణిపై తుపాకి పెట్టి.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సాగును నాశనం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై నిందలు వేస్తోందన్నారు. కరెంట్ కష్టాలకు బొగ్గు లేకపోవడమే కారణమని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. పవర్ ప్లాంట్స్‌కు సింగరేణి బొగ్గు ఇవ్వడం లేదని బద్నాం చేస్తోందని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఆయన వెల్లడించారు.
అందుకే సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.‘పోరాటాల పురిటిగడ్డ రామగుండం. తెలంగాణ వచ్చిన రోజు రాష్ర్టం చుట్టూ చీకట్లే. అలాంటి నేపథ్యంలో సింగరేణి సాయంతో కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ.. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. కేసీఆర్ మాటలను ప్రజలు పెడచెవిన పెట్టారు.
కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది’ అని కేటీఆర్ చెప్పారు. సింగరేణిలో రూ.10 వేల కోట్లకు పైగా కుంభకోణాలు జరిగాయని, వీటిపై సీబీఐ, విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2023లో సింగరేణిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగగా, 2025- ఆర్థిక సంవత్సరంలో 58 మిలియన్ టన్నులకు తగ్గిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిదిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి సంస్థలో టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని అడ్డుపెట్టుకుని రూ.10 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది సుజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. టెండర్లలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
‘సింగరేణిది 137 ఏండ్ల చరిత్ర. ఈ నాటిది కాదిది. కార్మికుల త్యాగముఉన్నది.. కార్మికుల కష్టమున్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులున్నారు. అవిటివాళ్లైన వాళ్లున్నరు. చీకటి గుహల్లో రక్తతర్పనం చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసిన వేలాది కార్మికుల కుటుంబాలున్నాయి. చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా.. అంటే మన సంగిరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునని’ కేటీఆర్ అన్నారు.
‘ఉత్పత్తిలో మొనగాళ్లు, ఉద్యమాల్లో కూడా మొనగాళ్లు మీరు. ఆనాడు బాగా యాదికుంది.. కేసీఆర్ పిలుపునిస్తే సకలజనుల సమ్మెలో 35 రోజులపాటు ఒకసారి, 7 రోజులు ఒకసారి 42 రోజులపాటు ఒక్క బొగ్గు పెళ్ల రాకుండా మీరు ఆరోజు తిరగబడితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయిన మాట ఎవరూ మరిచిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ రోజుల కేసీఆర్ తెలంగాణ జెండా ఎగరేసి బయలుదేరితే ఆయనకు అండగా నిలబడ్డది.. ఇదే సింగరేణి కార్మిక లోకమనే మాట మేమెవరం మరిచిపోలేదు. ఆ రోజు కేసీఆర్ కో అంటే మీరు కోల్ బెల్ట్ మొత్తంకో అని బయలుదేరారు అని చెప్పారు.
కార్మికులను విస్మరించారు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌లను భారీగా ఇవ్వడంతో పాటు డిపెండెం ట్ ఉద్యోగాల పునరుద్ధరణ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం సింగరేణి సంస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. సింగరేణి తెలంగాణకు గుండెకాయ వంటిదని, అలాంటి సంస్థ పై కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారాలు చేస్తూ దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ మోసాలను కేటీఆర్ నాయకత్వంలో గడపగడపకూ తీసుకెళ్తామ న్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో గోదావరిఖని అభివృద్ధిలో దూసుకెళ్లిందని, సింగరేణి కార్మికులకు కార్పొరేట్ తరహా ఆసుపత్రులు, క్వార్టర్ల ఆధునీకరణ, ఎన్నో సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు.
కానీ, కాంగ్రెస్ పాలకులు సంస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభకు వేలాది మంది కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు, యువత తరలివచ్చారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా జై కేటీఆర్, జై కేసీఆర్, మళ్లీ కేసీఆర్ సారే రావాలి.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే లు పుట్ట మధు, దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, టీబీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గడ్డం పెంచిన..
‘వచ్చేటప్పుడు కరీంనగర్లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు ఆపితే అక్కడ కొద్దిసేపు ఆగిన. ఏం సంగతి ఏమో గడ్డం పెంచినవ్ అని అడిగిండు. పోయేదెక్కడికి గోదావరి ఖనికి.. ఆ మాత్రం ఉండాలే కదా అని చెప్పిన. పోయేది సింగరేణికి కదా ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడువదు అని చెప్పిన’ అని కేటీఆర్ అన్నారు. ‘పోరాటాల పురిటి గడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే రణరంగం ఈ గడ్డ. నల్లబంగారు గనుల నుంచి తరలివచ్చిన మా కార్మిక అన్నలందరికీ హదయపూర్వక వందనం.
చెమట, నెత్తురు దారపోసి ఈ దేశానికి విద్యుత్ అందించి వెలుగులు ప్రసరించే విధంగా కష్టపడుతున్న ప్రతీ కార్మిక సోదరుడికి హదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన సింగరేణి కార్మికుల గర్జన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలతో హోరెత్తించారు.