చి‘వరి’ చింత!
- ఎండుతున్న పంట పొలాలు
- కరెంట్ కోతలు, నీటి ఎద్దడి ప్రధాన సమస్య
- రైతన్నలు ఆశలు గల్లంతేనా?
- కాపాడుకునేందుకు కర్షకుల తంటాలు
- ట్యాంకర్ల సేద్యంతో ఖర్చుల పాలు
కామారెడ్డి/బూర్గంపాడు, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కాలం కాటేసింది. వానకాలం(Monsoon season) వెనక్కి పోయింది. కాలువల నీరు కరువైంది. చెరువుల్లో నీరు ఇంకిపోతోంది. చివరకు బోరుబావుల్లో నీరైనా పంట పొలాలకు(Crop fields) జీవగంజి పోస్తుందనుకుంటే కరెంట్ చెయ్యిచ్చింది. విద్యుత్ కోతలతో(Power cuts) నీటి పారకం కూడా నిలిచింది. ఎన్నో ఆశలు, వేల రూపాయల పెట్టుబడి అంతా ఎండలకు ఆవిరవుతున్నాయి. కర్షకులకు కన్నీరే దిగుబడిగా మిగిలే దుస్థితి నెలకొంది. కండ్ల ముందు ఎండుతున్న పంటలకు డబ్బులు పోసి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
కామారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు
కామారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు రోజుకురోజుకు పెరుగుతున్నాయి. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, తాడువాయి, సదాశివ నగర్, గాంధారి, రామారెడ్డి, రాజం పేట, మండలాల్లోని వేలాది ఎకరాల వరి ఎండుముఖం పడుతున్నదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్న(Corn) సైతం నీటి వసతి లేక కంకులు పీలపోతున్నాయని వాపోతున్నారు.
కనీసం బోరు బావుల కింద ఉన్న వరి పొలాలను రక్షించుకుందామనుకున్నా కరెంట్ కోతలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వరి పంటలు గింజ గట్టి పడే దశలో ఉన్నాయని, ఈ సమయంలో ఒకటి, రెండు తరులు నీరు పారిస్తే నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. లేదంటే గింజ తాలుగా మారే ప్రమాదం ఉంటుందని దిగులు చెందుతున్నారు.
ట్యాంకర్ల సేద్యం..
కామారెడ్డి జిల్లాలో జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాలలో నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు రావడంతో పంటలు పండి రైతులు గట్టెక్కారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి పంటలను కాపాడుకునేందుకు చివరకు అప్పులు చేసైనా నీటిని కొనుగోలు చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. ఒక్కో రైతు రూ.50వేలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
కనీసం 20 రోజులు విద్యుత్ సరఫరా సక్రమంగా సరఫరా చేస్తే పంటలు చేతికందుతాయని అంటున్నారు. అయితే, పైనుంచే విద్యుత్ సరఫరా ఎక్కువ లేదని, స్థానిక విద్యుత్ అధికారులు చెబుతుండడంపై రైతుల్లో నిర్వేదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి.. చివరి దశలో ఉన్న పంటలకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా అందేలా చూడాలని కోరుతున్నారు.
బూర్గంపాడు రైతుల్లో బెంగ!
బూర్గంపాడు మండలంలోనూ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. బోరుబావుల్లో నీళ్లున్నా కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు ఆరు గంటలకు మించి కరెంట్ ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. అది కూడా మధ్యమధ్యలో పోతూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కోసం కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. వరి పంట నీటి యాజమాన్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం నీటి తడులు అందకపోవడంతో పొలాల్లో నేల ఎండిపోయి నెర్రెలు బారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆశించిన దిగుబడి రాకపోవచ్చని భయపడుతున్నారు. పెట్టిన పెటుబడులు భారంగా మారే ప్రమాదం ఉందని దిగులు చెందుతున్నారు. పంటకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతికినా విద్యుత్ సరఫరాపైనే ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. వ్యవసాయానికి నిర్ణయించిన సమయాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. తరచూ కోతలు విధించకుండా, వోల్టేజీ సమస్యలు లేకుండా విద్యుత్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.