మహిళలు పనిచ్చే స్థాయికి ఎదగాలి

15-10-2026 | 05:05am
  1. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వలక్ష్యం
  2. బ్యాంకర్లకు సన్మానంలో మంత్రి సీతక్క
  3. ‘సరస్ ఫెయిర్ 2026’లో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : గ్రామీణ మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క(Seethakka) పేర్కొన్నారు. మహిళలు చేయిచాచి అడిగే స్థాయి నుంచి, పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలపై(Women's groups) నమ్మకంతో పెద్దఎత్తున రుణాలిస్తున్న బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు సంపాదించే ప్రతి రూపాయి వారి శ్రమకు, కష్టానికి ప్రతిఫలమన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ‘సరస్ ఫెయిర్ బ్యాంకర్లను మంత్రి సన్మానించారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా రూ.75 వేల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న రుణ పరిమితిని రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు.  గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.  ఆ తర్వాత బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో పాటు సీతక్క.. మహిళలతో కలిసి ఆడిపాడారు.  అంతకుముందు సీతక్క.. గాంధీభవన్‌లో జరిగిన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు. బతుకమ్మ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని  మంత్రి  పేర్కొన్నారు. 

ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి: సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీఆర్‌డీఓ అధికారులు సమర్థవంతంగా పని చేసి తమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. బుధవారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా మంత్రిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కరణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ నర్సింహులు, ట్రెజరర్ నవీన్, వైస్ ప్రెసిడెంట్లు ప్రవీణ్, సబిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు