రైతు బాగుంటే.. అందరం బాగుంటాం
అన్నదాతలు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రైతు బాగుంటేనే అందరం బాగుంటామని, సూపర్ ఎలినినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలను వేసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijayaramana Rao) అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో దివ్యదర్శనరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు, అలాగే ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, ఈ సమావేశం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, తహసిల్దార్ బసిరుద్దీన్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.