జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి
- జిల్లావ్యాప్తంగా 50 దుకాణాల్లో తనిఖీలు.. 9 కేసులు నమోదు
- అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత(Artificial shortage of rice) సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు(Strict measures) తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని వ్యాపారులకు సూచించారు.
జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు జిల్లా వ్యాప్తంగా 50 బియ్యం దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 9 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ రకం బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు.
ప్రతి దుకాణం ఎదుట బియ్యం ధరలు, రోజువారీ నిల్వ వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని, కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. 26 కిలోల బస్తా పేరుతో 24 లేదా 25 కిలోల బియ్యం విక్రయిస్తే మోసపూరిత కొలతల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అక్రమ నిల్వలు(Illegal stocks), తూకాల్లో తేడాలు, అధిక ధరల విక్రయాలు గుర్తిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.