ఆయిల్ పామ్ రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి

10-11-2026 | 03:45pm

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఆయిల్ పామ్ రైతులు(Oil Palm Farmers) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని జ్యోతి(District Horticulture Officer Jyothi) తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్కులార గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగులో(Oil Palm Cultivation) నీటి యాజమాన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులు, పంట యాజమాన్య మెళుకువలు, ప్రభుత్వ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు.

ప్రత్యేక రైతు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

ఆయిల్ పామ్ తోటల్లో బిందు సేద్యం ద్వారా అవసరమైన మేరకు నీటిని అందించాలని సూచించారు, మొక్కల చుట్టూ తేమ నిల్వ ఉండేందుకు మల్చింగ్ చేపట్టాలన్నారు., కలుపు మొక్కలను నియంత్రించాలని సూచించారు. ఎండ తీవ్రత నుంచి మొక్కలను రక్షించడంతో పాటు, సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వినియోగించాలని కోరారు, మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని వివరించారు. మొక్కల పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి, గెలల దిగుబడి పెంపునకు అనుసరించాల్సిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు అర్హులైన రైతులకు మొక్కల సరఫరా, బిందు సేద్యం పరికరాలపై రాయితీలు, పంట నిర్వహణకు ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటల నిర్వహణకు ఒక ఎకరానికి సంవత్సరానికి రూ.4,200 చొప్పున  రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు.రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జగదీష్ చంద్రబాబు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని, ఉద్యాన శాఖ,కంపెనీ అధికారులు అందించే సాంకేతిక సూచనలను అనుసరించాలని తెలిపారు. నాణ్యమైన దిగుబడి సాధించాలంటే సరైన సమయంలో తోటల నిర్వహణ చేపట్టడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉద్యాన శాఖ అధికారులు, మద్నూర్ మండల వ్యవసాయ అధికారి, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సిబ్బంది, ఉద్యాన శాఖ సిబ్బంది, సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు