పెద్దపల్లి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
ఐటీఐ కళాశాలలో నూతన వాకింగ్ ట్రాక్
జెండా చౌరస్తాలో 150 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు
నిట్టూరు, నిమ్మనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, నవంబర్ 21(విజయ క్రాంతి) : పెద్దపల్లి అభివృద్ధికి(Development of Peddapalli) ప్రత్యేక దృష్టి సారించామని, పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న నూతన వాకింగ్ ట్రాక్, లైటింగ్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం జెండా చౌరస్తా వద్ద కొనసాగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. జెండా చౌరస్తాలో 150 అడుగుల భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన పాత కమాన్ స్థానంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మిస్తామని తెలిపారు. జెండా చౌరస్తా నుంచి మసీదు చౌరస్తా వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం పెద్దపల్లి మండలంలోని నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో ఆలోచించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.