పెద్దపల్లి ఎంపీ దళిత నాయకుడు కాదు.. ధనిక నాయకుడు
మంథని, నవంబర్ 28 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో ప్రోటోకాల్, శిలాఫలకాల అంశంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్ ఘాటుగా స్పందించారు. శనివారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రోటోకాల్ (Protocol), శిలాఫలకాల గురించి మాట్లాడే ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. గాంధీ చౌక్‌లో వర్తక సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఓడ్నాల శ్రీనివాస్ పేరును అప్పట్లో శిలాఫలకంపై ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. గతంలో ప్రోటోకాల్‌ను పట్టించుకోని వారు ఇప్పుడు అదే అంశంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీల సంక్షేమం, గౌరవం గురించి మాట్లాడటమే కాకుండా ఆయా వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను వివరించాలని పుట్ట మధుకర్‌కు సూచించారు.
ఎంపీ వంశీకృష్ణ పాత వీడియో ప్రదర్శన
ఎంపీ గడ్డం వంశీకృష్ణ గతంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తన రోల్ మోడల్‌గా (Role Model) అభివర్ణించిన వీడియోను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు. 2004 ఎన్నికల సమయంలో తొలిసారి శ్రీధర్ బాబును కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని వంశీకృష్ణ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు రోల్ మోడల్‌గా కొనియాడిన నాయకుడిపై ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత వ్యాఖ్యలకు, ప్రస్తుత వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.
దీక్షలో ఉన్న ఎంపీ వంశీకృష్ణ అనవసర వివాదాలకు దూరంగా ఉండి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. పెద్దపల్లి ఎంపీ దళిత నాయకుడు కాదు.. ధనిక నాయకుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దళితులు, నేతకాని సామాజిక వర్గాల సంక్షేమం గురించి మాట్లాడే ముందు ఎంపీగా వారి అభ్యున్నతికి చేసిన కృషిని వివరించాలని డిమాండ్ చేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని సెగ్గెం రాజేష్ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలను పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణించి ఎంపీ వంశీకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే తన వాదనను ప్రజల ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంథని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, మాజీ సర్పంచ్ కల్వల రాజేష్, పార్టీ డివిజన్ అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.