తవ్వినోడికి తవ్వుకున్నంత..
- మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ?
- ఆమనగల్లులో యథేచ్ఛగా సహజ సంపద దోపిడీ
- రాత్రివేళల్లో ’రయ్ రయ్’ అంటూ టిప్పర్ల దందా
- ఆకుతోటపల్లి సర్వే నం.304లో గుట్టలు గుల్ల -
- అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
- సాకిబండ తండాలో అక్రమ తరలింపును అడ్డుకున్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గీత ఆచారి
- ప్రభుత్వ పనుల ముసుగులో ప్రైవేటు సంస్థలకు మట్టి విక్రయం
- రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): ఆమనగల్లు మండలం(Amanagal Mandal), మున్సిపాలిటీ పరిధిలో మట్టి మాఫియా(Soil Mafia) ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ‘ప్రభుత్వ పనే కదా.. మమ్ములను ఆపే దమ్ము ఎవరికీ లేదు‘ అన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎలాంటి మైనింగ్, రెవెన్యూ అనుమతులు(Mining and Revenue Permissions) లేకుండానే పచ్చని గుట్టలను, రైతుల పట్టా భూములను జేసీబీలతో తవ్వేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పగలు కాస్త నిశ్శబ్దంగా ఉండి, రాత్రి వేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో ’రయ్ రయ్’ మంటూ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఆకుతోటపల్లిలో గుల్లవుతున్న గుట్టలు.. అధికారుల ఉదాసీనత..
ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామపంచాయతీ(Akutotapalli Gram Panchayat) సర్వే నంబర్ 304లో అక్రమ మట్టి తవ్వకాలు పరాకాష్టకు చేరాయి. ఈ అక్రమ దందా వల్ల భూముల్లో భారీ గుంతలు ఏర్పడి, సమీపంలోని పంట పొలాలు కోతకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే స్థానిక తహసీల్దార్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కిరణ్మయిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమనగల్లు మున్సిపాలిటీ మూడో వార్డు సాకిబండ తండాలోని సర్వే నంబర్ 201లో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపుపై మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తల్లోజు గీత ఆచారి ఉక్కుపాదం మోపారు. రేడియో రోడ్డు పనుల పేరుతో రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్నారని స్థానిక రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన గీత ఆచారి సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి తరలింపును అడ్డుకున్నారు.
ప్రభుత్వ పనుల పేరుతో ప్రైవేటు వ్యాపారం?
స్వామి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం రైతుల భూముల నుంచి అక్రమంగా తవ్విన మట్టిని ఏఎల్ఎంటీ అనే ప్రైవేటు సంస్థకు విక్రయిస్తోందని బాధిత రైతులు వైస్ చైర్పర్సన్ ఎదుట వాపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, నిర్వాహకులను నిలదీసి తక్షణమే తవ్వకాలు, రవాణా నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలపైనా కన్ను..
ఇదే క్రమంలో మూడో వార్డు పరిధిలోని ధర్మకంట అటవీ ప్రాంత పరిసరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న పునాదులు, అక్రమ ఇళ్ల నిర్మాణాలను గీత ఆచారి పరిశీలించారు. బాధ్యుల వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి, నిబంధనల ప్రకారం విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు.
రైతుల జోలికొస్తే ఊరుకోం: గీత ఆచారి
అన్నదాతల కష్టాన్ని, వారి భూముల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గీత ఆచారి స్పష్టం చేశారు. రైతులను పోలీసుల ద్వారా కానీ, ఇతర మార్గాల్లో కానీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మట్టి మాఫియాపై రెవెన్యూ, మైనింగ్, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.