ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అక్రమాల పర్వం..!

06-10-2026 | 05:25am
  1. చేవెళ్ల వెంకన్న ఆలయంలో ‘నిర్వాకం’
  2. చుట్టూ కబ్జాలు.. మాయమవుతున్న ఆదాయం.. 
  3. సమాధానం దాటవేస్తున్న అధికారులు

చేవెళ్ల, అక్టోబర్ 5 (విజయక్రాంతి): చేవెళ్ల బెల్లపురాతి గుట్టపై(Chevella Soapstone Hillock) కొలువుదీరి, వేలాది మంది భక్తుల కొంగుబంగారం గా  విరాజిల్లుతున్న బాలాజీ వెంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం(Balaji Venkateswara Swamy) ప్రస్తుతం నిర్లక్ష్యానికి, అక్రమాలకు నిలయంగా మారింది. చారిత్రాత్మక ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక వైభవం ఉన్న ఈ ఆలయంలో ఎండోమెంట్ అధికారుల(Endowments officials) నిర్లక్ష్యం మేరలు దాటింది. ఒకవైపు కోట్లాది రూపాయల భూములు ఆక్రమణల పాలవుతుంటే, మరోవైపు స్వామివారికి సమర్పించే కానుకలు, విరాళాల లెక్కలు అదృశ్యమవుతున్నాయి. చివరకు పవిత్రమైన పండుగ రోజున భక్తులకు కనీసం ప్రసాదం కూడా అందించలేని దౌర్భాగ్య స్థితికి ఆలయ నిర్వహణ దిగజారడం స్థానికులను, భక్తులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

తొలి ఏకాదశి రోజే భక్తులకు తీవ్ర నిరాశ....

వేలాది మంది భక్తులు ఎంతో నిష్ఠతో, స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకునే తొలి ఏకాదశి పర్వదినాన ఆలయంలో తీరని లోటు ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదం దొరక్క నిరాశతో వెనుతిరిగారానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పండగ రోజుల్లో వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. స్వామివారికి నివేదన, భక్తులకు వితరణ అనే ప్రాథమిక ధర్మాన్ని పక్కనబెట్టడం ఆలయ ప్రతిష్టను దిగజార్చిందని భక్తజనం మండిపడుతున్నారు.

బహుళ అంతస్తులు కబ్జాలు..

దేవాదాయ శాఖకు చెందిన అమూల్యమైన స్థలాలు స్వాహా అవుతున్నాయి. గతంలో వ్యాపారాల కోసం కొంతమందికి లీజుకు ఇచ్చిన భూములను, వారు అక్రమంగా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలుగా మార్చేశారు. ఆక్రమణదారులు ఈ భవనాలను ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలకు లక్షల్లో ఆర్జిస్తుండగా, దేవాదాయ శాఖకు మాత్రం కేవలం వేలల్లో చిల్లర పడేస్తున్నారని స్థానికులే బావాటంగా ఆరోపణ గుప్పిస్తున్నారు.అధికారుల మౌనం వెనుక రహస్యమేంటి?... స్థానికులు ఎన్నిసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. అధికారుల దయతోనే ఈ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు