త్రిబుల్ వన్ జీవోకు తూట్లు!
- పుట్టగొడుగుల్ల అక్రమ నిర్మాణాలు
- అక్రమార్కులకు అధికారుల అండ
- రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలు
- ఎల్ నినో ముప్పు వేళ అడ్డూ అదుపూ లేనీ నిర్మాణాలు
- ఖానాపూర్, జొన్నాడ, మీర్జజగూడ, గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు
- నార్సింగి సర్కిల్ -45లో సాయిరెడ్డి పాత్రపై ఆరోపణలు
- రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పనితీరుపై ప్రశ్నలు
విజయక్రాంతి నిఘా విభాగం, నవంబర్ 12: ఒకవైపు ఎల్ నినో ప్రభావం(El Niño Effect)తో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలపై ప్రభుత్వం అప్రమత్తమై నీటి సంరక్షణకు కఠిన చర్యలు చేపడుతుంటే.. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధనలను పక్కనపెట్టి భారీ నిర్మాణాలు చేపడు తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 పరిధిలోని ఖానాపూర్, జొనడ, మెర్జజగూడ, గోలిదౌడి పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ షెడ్లు, గోదాములు నిర్మిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లు, రి సార్టులు, అక్రమ బోర్ల వ్యవహారాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త బోర్లపై ఆంక్షలు విధిస్తూ, నిర్మాణ అవసరాలకు భూగర్భ జలాల వినియోగాన్ని నిషేధించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిందనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
జీవో 111 అసలు ఉద్దేశం ఏమిటి?
హైదరాబాదుకు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణే లక్ష్యంగా 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చింది. ఈ రెండు జలాశయాల పూర్తి నిల్వ మట్టం నుంచి పది కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో పలు నిర్మాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.
మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు జలాశయాల్లో కలవకుండా చూడటం, భూగర్భ జలాలు, పర్యావరణాన్ని కాపాడటం ఈ జీవో ప్రధాన ఉద్దేశం. అయితే 2022లో జీవో 69 ద్వారా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో వివాదం మొదలైంది. అనంతరం ఈ అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లింది. కాబట్టి జీవో 111 పూర్తిగా రద్దయిందని భావించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.
జీవో 259తో కొత్త బోర్లపై కఠిన ఆంక్షలు
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం అక్టోబర్ 29న జీవో 259 ద్వారా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2027 జూలై చివరి వరకు అమల్లో ఉండనున్నాయి. క్యూర్ పరిధిలో కొత్త బోర్లు తవ్వాలంటే సంబంధిత నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి, నిరభ్యంతర పత్రం తప్పనిసరి చేసింది. నిర్మాణ పనులు, తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రత వంటి తాగునీరు అవసరం లేని పనులకు భూగర్భ జలాలను వినియోగించరాదని ఆదేశించింది. ఈ అవసరాలకు జలమండలి అందించే శుద్ధి చేసిన మురుగునీటినే వినియోగించాలని పేర్కొంది.
ఖానాపూర్ ప్రధాన రహదారిలో భారీ నిర్మాణాలకు అనుమతులెక్కడ?
ఖానాపూర్ పరిధిలో భారీ కమర్షియల్ షెడ్ (గోదాము) నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. మెటల్ షీట్ల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందారా? భూమి స్వభావం ఏంటి? వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు మా ర్చారా? నిర్మాణ ప్రణాళికకు ఆమోదం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
ఇదే తరహాలో జొనడ, మెర్జజగూడ, గోలిదౌడి పరిసర ప్రాంతాల్లోనూ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రహదారుల పక్కనే నిర్మాణాలు కొనసాగుతున్నా రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తు న్నారు.
హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లు రిసార్టుల హవా!
జీవో 111 పరిధిలోని ప్రాం తాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనే ఆరోపణలు ఆం దోళన కలిగిస్తున్నాయి. హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లు, రిసార్టులు, భారీ గోదాములు ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో భూమి వినియోగ మార్పులు, నిర్మాణ అనుమతులు, మురుగునీటి శుద్ధి వ్యవస్థల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వందలాది మంది రాకపోకలు సాగించే వాణిజ్య సంస్థలకు ఎంత నీరు అవసరమవుతోంది? ఆ నీటిని ఎక్కడి నుం చి తీసుకుంటున్నారు? మురుగునీటిని శుద్ధి చేస్తున్నారా? జలా శయాల పరిసరాల్లో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్న అంశాలపై అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలి.
చైన్మన్ సాయిరెడ్డి పాత్రపై ఆరోపణలు!
నార్సింగి సర్కిల్-45 పరిధిలో అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ షెడ్ల వ్యవహారంలో మున్సిపల్ సిబ్బంది సాయిరెడ్డి పాత్రపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో భారీగా వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివి? అనుమతులు లేకుండా పనులు జరుగుతుంటే సంబంధిత సిబ్బంది ఎందుకు అడ్డుకోవడం లేదు? సాయిరెడ్డి పాత్రపై ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు విస్మరించకుండా నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారులు మేల్కొనేది ఎప్పుడు?
ఖానాపూర్, జొన్నాడ, మెర్జజగూడ, గోలిదౌడి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలపై రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండీఏ, భూగర్భ జలాల శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన సర్వే నంబరు, భూమి స్వభావం, నిర్మాణ అనుమతులు, భూ వినియోగ మార్పుల వివరాలను పరిశీలించాలని కోరుతున్నారు. జీవో 259 ప్రకారం కొత్త బోర్లకు అనుమతులు ఉన్నాయా? నిర్మాణాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారా? జీవో 111 పరిధిలో వర్తించే నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపించాలని కోరుతున్నారు.ప్రభుత్వం ఎల్‌నినో ముప్పును ముందుగానే గుర్తించి నీటి సంరక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నారు? నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా ఝళిపించేది ఎప్పుడు? అన్న ప్రశ్నలకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.