రూ. కోట్ల విలువైన ‘శిఖం’ స్వాహా
- 28 ఎకరాల కాల్వ... 3 ఎకరాలకే పరిమితం...
- పెద్ద అంబర్పేట్ సర్వే నం. 354లో యథేచ్ఛగా ఆక్రమణలు..
- అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
- ‘హైడ్రా’ తక్షణమే రంగంలోకి దిగాలని విజ్ఞప్తి
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబరు 1(విజయక్రాంతి):ప్రభుత్వ ఆస్తులకు(Government assets), జల వనరులకు రక్షణగా నిలవాల్సిన అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంగా మారింది. చెరువులు, కాల్వలు, శిఖం భూములను పరిరక్షించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తుండటంతో అక్రమార్కులు(Wrongdoers) యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు.
మల్కాజిగిరి ము న్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్, నాగో ల్ సర్కిల్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 354లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం గతంలో సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రతిష్టాత్మక ‘శిఖం కాలువ‘ నేడు కబ్జాదారుల చేతుల్లో నలిగిపోయి కేవ లం 3 ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 25 ఎకరాల మేర కాల్వ భూమి మాయమైనా పర్యవేక్షించాల్సిన ఆయా శాఖల అధికారులు కంటితుడుపు చర్యలైనా తీసుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
హద్దులు చెరిపేసి.. నిర్మాణాలు లేపేసి....
ఈదుల చెరువు నుంచి చెక్‌డ్యామ్ వరకు విస్తరించిన ఈ కాలువ ఒకప్పుడు వర్షపు నీటి ప్రవాహానికి ప్రధాన ఆధారంగా ఉండే ది. అయితే కాల్వకు ఇరువైపులా ఉన్న పట్టా భూముల యజమానులు, ప్లాటర్లు మెల్లమెల్లగా ప్రభుత్వ శిఖం భూముల్లోకి చొరబ డ్డారు. రాత్రికి రాత్రే కాల్వను పూడ్చివేస్తూ, సరిహద్దులను చెరిపేస్తూ ఆక్రమణలకు పాల్పడ్డారు.
కొన్నిచోట్ల ఏకంగా శాశ్వత ని ర్మాణాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా చేపట్టేశారు. ఫలితంగా సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గం పూర్తిగా మూ సుకుపోయి, రాబోయే వర్షాకాలంలో సమీ ప నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది.
అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.....
కళ్లముందే ఎకరాల కొద్దీ కాల్వ భూమి కనుమరుగవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నా రు. ఆక్రమణల విషయాన్ని ఆధారాలతో సహా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వినతిపత్రాలు సమర్పించినా క్షేత్రస్థా యిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని ఆరోపిస్తున్నారు.
‘హైడ్రా’ బుల్డోజర్లు అక్కడ దిగాల్సిందే
ప్రస్తుతం నగరంలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ’హైడ్రా’ అధికారులు త క్షణమే పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 354పై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమగ్ర రీ-సర్వే
రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహించి కాల్వ అసలు సరిహద్దులను తేల్చాలి.28 ఎకరాల నుంచి 3 ఎకరాలకు ఎలా కుదించుకుపోయిందో వి చారణ జరిపి, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి కాల్వను పునరుద్ధరించాలి.బాధ్యులైన కబ్జాదారులతో పాటు వారికి సహ కరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
అధికారుల నిర్లక్ష్యంతోనే కబ్జాలు...
కాల్వ శిఖం భూముల కబ్జాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించలే దు. కాల్వను ఆనుకొని ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ విలువైన కాల్వ భూమిని కబ్జాదారుల కోరల నుంచి కాపాడాలి.
యంజాల ప్రహ్లాద్, బీఎస్పీ రంగారెడ్డి సోషల్ మీడియా కన్వీనర్