గుట్టలు గుల్ల!
సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
కుర్చీలాటలో గనులశాఖ.. నిద్రావస్థలో టాస్క్‌ఫోర్స్
- పుట్టగొడుగుల్లా వెలుస్తున్న క్రషర్లు, క్వారీలు
- సీనరేజ్ ఎగవేత.. వే-బిల్లుల్లో అక్రమాలు
- పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, పుల్కల్లో యథేచ్ఛగా తవ్వకాలు
- ఇష్టారీతిగా బ్లాస్టింగ్స్.. భయాందోళనల్లో స్థానికులు
- మొరం, ఇసుక కోసం చెరువులు, కుంటలకు గండ్లు
- అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అండదండలు
(ఏ చంద్రశేఖర్ రావు) :
సంగారెడ్డి బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరానికి(Hyderabad metropolis) కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సహజ సంపద అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం(Real Estate and Construction Sector) శరవేగంగా విస్తరిస్తుండటంతో కంకర, ఎర్రరాయి, నల్లమట్టి, మొరం, ఇసుకకు(Sand) విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మైనింగ్ మాఫియా(mining mafia) జిల్లావ్యాప్తంగా అక్రమ తవ్వకాలకు తెరలేపింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల సీనరేజ్ ఆదాయానికి గండి పడుతున్నది.
తెలంగాణ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్(Telangana Vigilance and Enforcement) తనిఖీల ప్రకారం రాష్ట్రంలోని వివిధ యూనిట్లలో ప్రాథమికంగా రూ.331 కోట్ల మేర సీనరేజ్ ఎగవేత జరిగినట్లు గుర్తించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 170 క్వారీలపై జరిపిన సర్వేలో రూ.389 కోట్ల సీనరేజ్ ఎగవేత బయటపడింది. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో బడా క్వారీ లీజుదారుడిపైనే గతంలో ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వేల ద్వారా పదుల కోట్ల నుంచి వందల కోట్ల రూపాయల వరకు సీనరేజ్ ఎగవేత, జరిమానా డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. అధికారిక లెక్కలకు చిక్కకుండా వే-బిల్లుల మాయాజాలం, ఓవర్‌లోడ్ ద్వారా జిల్లాలో ఏటా దాదాపు రూ.50 కోట్ల నుంచి 100 కోట్లకు పైగా సీనరేజ్ ఆదాయానికి గండి పడుతున్నట్లు అంచనా.
అనుమతుల ముసుగులో దోపిడీ..
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, లక్డారం, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో క్వారీలు, క్రషర్ల నిర్వహణలో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు లీజుదారులు అనుమతి పొందిన విస్తీర్ణం, లోతును దాటి.. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోకి చొరబడి తవ్వకాలు జరుపుతున్నారు. గతంలో పటాన్చెరు మండలం లక్డారం క్వారీల్లో జరిగిన అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఏకంగా వందల కోట్ల రూపాయల జరిమానాతో డిమాండ్ నోటీసులు జారీ చేయడం ఈ దందా తీవ్రతకు అద్దం పడుతున్నది.
జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) పరిధిలోని ప్రభుత్వ భూముల్లో రాత్రింబవళ్లు అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు సాగుతున్నాయి. ఇటీవల అధికారులు మెరుపు దాడులు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినా.. అక్రమార్కుల తీరు మారడం లేదు. ఇక.. పుల్కల్, అందోల్, కంది మండలాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను చెరబడుతున్నారు. అనుమతులు లేకుండానే నల్లమట్టి, మొరం, ఇసుకను తోడేస్తూ వందలాది టిప్పర్ల ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వేబిల్లుల మాయాజాలం
ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ (సీనరేజ్) ఎగవేయడానికి మాఫియా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నది. ఒకసారి జారీచేసిన వే-బిల్లు ఆధారంగా రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్లను తరలిస్తున్నారు. వాహనాల్లో ఓవర్ లోడ్‌తో కంకర, మట్టిని తరలిస్తూ.. రికార్డుల్లో మాత్రం తక్కువ పరిమాణం చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా, పేలుడు పదార్థాల లైసెన్సులు లేకుండానే భారీ బ్లాస్టింగ్లు జరుపుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
మైనింగ్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు, కొందరు కిందిస్థాయి అధికారుల మామూళ్ల మత్తు కారణంగానే ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నదని స్థానికులు మండిపడుతున్నారు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా వాహనాలను సీజ్ చేసి, నామమాత్రపు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అధికారులపై ఉన్నాయి.
కుర్చీలాటలో గనుల శాఖ..
సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ దందా ఇంతలా విచ్చలవిడిగా సాగడానికి ప్రధాన కారణం గనుల శాఖలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన జిల్లా మైనింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు తరచూ మారుతుండటం, చాలాకాలం పాటు ఇన్చార్జ్ అధికారులతోనే నెట్టుకురావడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులో ఎవరూ ఎక్కువ కాలం స్థిరంగా ఉండటం లేదు.
ఒక అధికారి బాధ్యతలు చేపట్టి జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, క్వారీల సరిహద్దులు, లీజుల వివరాలపై పట్టు సాధించేలోపే బదిలీ వేటు పడుతున్నది. ఆ తర్వాత వచ్చే కొత్త అధికారికి రికార్డులు పరిశీలించడానికే నెలల సమయం పడుతున్నది. ఈ మధ్యకాలంలో పొరుగు జిల్లాల అధికారులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తుండటంతో, వారు వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే సంగారెడ్డి కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో క్వారీలను తనిఖీ చేసే నాథుడే కరువయ్యారు.
సిబ్బంది కొరత.. మాఫియాకు ధీమా
అధికారుల మార్పులకు తోడు సంగారెడ్డి జిల్లా గనుల శాఖ కార్యాలయంలో రాయల్టీ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పటాన్చెరు, జిన్నారం, జహీరాబాద్, అందోల్ వంటి సువిశాల ప్రాంతాల్లోని వందలాది క్వారీలు, క్రషర్లు, మట్టి తవ్వకాలను పర్యవేక్షించడానికి సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదు. దీనికి తోడు క్వారీ యజమానులు, స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు కిందిస్థాయి సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
కాగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రవాణా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూడిన జిల్లా స్థాయి మైనింగ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉమ్మడి దాడులు నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడో లేదా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడో హడావుడిగా నాలుగైదు వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.