పాలకులు మారినా.. రోడ్ల రాత మారదా?
ప్రభుత్వాలు మారుతున్నా.. మారని రహదారుల దుస్థితి!
కంజర్ల–శివనగర్, గుమ్మడిదల–కానుకుంట, కిష్టారెడ్డిపేట–కొడకంచి మార్గాలు అధ్వానం
గుంతలమయమైన రహదారులతో ప్రజలకు నిత్యం నరకయాతన.. పట్టించుకునే అధికారులేరీ?
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం(Patancheru Constituency)లో రహదారుల దుస్థితి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులు మారుతున్నా.. రోడ్ల పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయమైన రహదారులపై ప్రయాణం నిత్యపోరాటంగా మారిందని వాపోతున్నారు.
కంజర్ల నుంచి శివనగర్ వరకు వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు గుమ్మడిదల నుంచి కానుకుంట వరకు రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు పరీక్షగా మారింది. ఇక కిష్టారెడ్డిపేట నుంచి కొడకంచి వరకు ఉన్న రహదారి సైతం అధ్వానంగా తయారైంది. ఈ మార్గాల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ఇతర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదాలకు దారితీస్తున్న గుంతలు
రాత్రివేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాల రాకపోకలకు కూడా రహదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. నిత్యం ఈ మార్గాల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
హామీలకే పరిమితమవుతున్న రోడ్ల అభివృద్ధి?
ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారులపై మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారంగా నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లినా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి కంజర్ల–శివనగర్, గుమ్మడిదల–కానుకుంట, కిష్టారెడ్డిపేట–కొడకంచి రహదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిధులు కేటాయించి నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలు, ప్రయాణ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లు బాగుపడే రోజు ఎప్పుడోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.