మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

14-10-2026 | 10:21pm

గజ్వేల్‌: గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాల(Bathukamma Celebrations)ను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన రవీందర్‌, కమిషనర్‌ పి. గణేష్‌ రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్యాణకర్‌ పద్మాబాయి నర్సింగరావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు.

బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చైర్‌పర్సన్‌ చందన రవీందర్‌ పేర్కొన్నారు. సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని కమిషనర్‌ గణేష్‌ రెడ్డి అన్నారు. ఉత్తమంగా పేర్చిన బతుకమ్మలకు మొదటి, రెండో, మూడో బహుమతులు అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులకు బహుమతులు, మహిళలకు వాయనాలు పంపిణీ చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది, మెప్మా ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు