తుది కూర్పే సస్పెన్స్

26-11-2026 | 05:20am

* న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ కోసం భారత్ సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పే ఆసక్తిని రేకెత్తిస్తోంది. బౌలింగ్ విభాగంలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో సిరాజ్‌ను పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు రావడంతో క్రైస్ట్‌చర్చ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకునే ఛాన్సుంది.

  1. సిరాజ్‌కు ఛాన్స్
  2. క్రైస్ట్‌చర్చ్‌లో పేస్ పిచ్
  3. బౌలింగ్‌లో మార్పులు

క్రైస్ట్‌చర్చ్, నవంబర్ 25: తొలి టెస్టులో(First Test) గెలిచే మ్యాచ్‌ను డ్రా చేసుకున్న టీమిండియా(Team India) ఇప్పుడు రెండో టెస్ట్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టులో భారత తుది జట్టు కూర్పుకు సంబంధించి తీవ్ర విమర్శలు వచ్చాయి. సిరాజ్(Mohammed Siraj), జడేజా(Jadeja) లాంటి సీనియర్లను పక్కన పెట్టడం మ్యాచ్ ఫలితంపై గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. వెల్లింగ్టన్ టెస్ట్(Wellington Test) ఐదు రోజుల పాటు సాగడం భారత పేసర్లపై తీవ్ర ప్రభా వం చూపింది.

ఆ మ్యాచ్‌లో భారత పేసర్లం తా కలిసి ఏకంగా 182 ఓవర్లు బౌలింగ్ చేశా రు. మ్యాచ్‌ల మధ్య కేవలం మూడు రోజుల విరామం మాత్రమే ఉండటంతో బౌలర్లకు సరైన విశ్రాంతి, కోలుకునే సమయం దొరకలేదు. ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేందుకే బుధ వారం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను కూడా టీమిండియా రద్దు చేసింది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవడం వల్ల భారత బౌలర్లపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో బుమ్రా వర్క్‌లోడ్‌పై ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

దాదాపు ఏడాది అనంతరం టెస్టు ల్లోకి రీఎంట్రీ చేసిన బుమ్రా తొలి టెస్టులో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఎక్కువగా బౌలింగ్ చేయించడం గాయాల ముప్పును పెంచుతుంది. క్రైస్ట్‌చర్చ్‌లోనూ మ్యాచ్  ఐదు రోజులు సాగి కివీస్ బ్యాటర్లు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే బుమ్రా మరోసారి 50 ఓవర్ల వరకు బౌలింగ్ చేయాల్సి రావచ్చు. దీనిని మేనేజ్‌మెంట్ ఎలా డీల్ చేస్తుందనేది చూడాలి. తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌తో కూడిన నలుగురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగింది.

మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్‌లను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సిరాజ్‌ను పక్కన పెట్టడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న బౌలర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదన్నారు. మ్యాచ్ అనంతరం సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గిల్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదు. అతను పీక్ ఫామ్‌లో లేడంటూ అందుకే పక్కన పెట్టామంటూ గిల్ చెప్పడం ఆశ్చర్యపరిచింది.

డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజే. అలాంటిది గిల్ చెప్పిన కారణాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ క్రైస్ట్‌చర్చ్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అటు జడేజా విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. తుది జట్టులో వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగిస్తారా లేక జడేజాను తీసుకుంటారా అనేది చూడాలి. మొత్తం మీద సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా తుది జట్టు ఎంపికలో ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు