కేసీఆర్ ఆమరణ దీక్ష... తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయి
* ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసిఆర్
* దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం..
* కడియం వెంకట్ రెడ్డి
గరిడేపల్లి, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష భారత రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టమని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కడియం వెంకట్ రెడ్డి(Kadiyam Venkat Reddy) అన్నారు. ఆదివారం దీక్షా దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ బాట పట్టారని కొనియాడారు.
తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమానికి రాజకీయ దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సమాజాన్ని ఉద్యమంలో ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని, ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, మేధావులు జర్నలిస్టులు సైతం సహా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఎందరో ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాలు, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రజల్లో చైతన్యం నింపి, ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, దీక్షా దివస్ అనేది కేవలం ఒక రోజు వేడుక కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మాశెట్టి శ్రీహరి, మన్సూర్ అలీ, సర్పంచులు బచ్చలకూరి శ్రీను, బొల్లెపల్లి రామనాథం, పెండెం ధనయ్య, కడియం స్వప్న, శంబిరెడ్డి, కీత రామారావు, నల్లపాటి భాస్కర్,ఆనంద్ బాబు, పెండెం వీరయ్య,రామ్ సైదులు పాల్గొన్నారు.