దొంగతనం, గంజాయి ముఠా గుట్టురట్టు
వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
కోదాడ నవంబర్ 28(విజయ క్రాంతి) : కోదాడ పట్టణంలో(Kodad town) ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు(Gold jewelry) దొంగిలించడంతో పాటు గంజాయి విక్రయాలకు(selling ganja) పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను కోదాడ పట్టణ పోలీసులు(Kodad Police) అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కోదాడ పట్టణానికి చెందిన షేక్ మస్తాన్, సొంటి సందీప్ అలియాస్ నటరాజ్, ఆలేటి గోపి వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాలకు పాల్పడ్డారని ఎస్పీ పేర్కొన్నారు.
గత అక్టోబర్ 20న బంజారా కాలనీలోని ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి ఆభరణాలు దొంగిలించారని, అందులో కొన్నింటిని ఖమ్మంలో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారని వివరించారు. మిగిలిన డబ్బుతో భద్రాచలం ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి కోదాడ పరిసరాల్లో విక్రయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో పటిష్ట నిఘా ఉంచిన పోలీసులు నవంబర్ 19న బాలాజీనగర్ శివారులో షేక్ మస్తాన్‌ను, ఈ నెల 27న శ్రీరంగాపురం వద్ద సందీప్, ఆలేటి గోపిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
నిందితుల వద్ద నుంచి రూ. 15 లక్షల విలువైన 9.150 తులాల బంగారు ఆభరణాలు, 12.3 తులాల వెండి ఆభరణాలు, రూ. 1.2 లక్షల విలువైన 6.2 కిలోల గంజాయి, రూ. 16 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన కోదాడ పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐలు అజయ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.