ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

18-11-2026 | 12:11am

స్పెషల్ అబ్జర్వర్ హరిచందన

వరంగల్​ (విజయక్రాంతి): ఓటరు తుది జాబితా సవరణ ప్రక్రియ పారదర్శంగా ఉండే విధంగా, ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​) ప్రక్రియను నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్.ఐ.ఆర్ ఎలక్ట్రోల్ అబ్జర్వర్ హరిచందన(Special Observer Harichandana) సంబధిత అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్​ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్​ చాహత్ బాజ్​ పాయ్​, బల్దియా కమీషనర్​ టి.వెంకన్న వరంగల్ పర్యటనకు వచ్చిన హరిచందనను మార్యద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

అనంతరం ఎస్ఐఆర్​ అబ్జర్వర్​ హరిచందన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ తీరుతెన్నులను, అభ్యంతరాల వివరాలను బూత్ లెవల్ ఆఫీసర్లను (బిఎల్ఓ)ను అడిగి తెలుసుకున్నారు. ఫామ్ 6, 7, 8 కొత్త దరఖాస్తులను సక్రమంగా పరిష్కరించారా లేదా అని ఆరా తీశారు. విచారణలు నిర్వహించిన తీరును, ఇంటింటి సర్వే పర్యవేక్షణ వివరాలను పరిశీలించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా రెండు చోట్ల ఓటు ఉన్న వారి పేర్లను జాబితా నుండి తొలగించేటప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించారా లేదా అని ఇఆర్ఓ/ అదనపు కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. 

సూపర్ చెకింగ్​లో భాగంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఆమోదించిన, తిరస్కరించిన దరఖాస్తులను,కొత్త ఓటర్ల చేర్పులు, తొలగింపులు, రోల్ అబ్జర్వర్ తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్  డాక్టర్ సత్యశారద, ఎస్.ఐ.ఆర్ లో భాగంగా మొదటి విడతలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు ఉన్న 51,073 మంది పేర్లు ఎఎస్​డిడి జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్  వైవి గణేష్, వరంగల్ తహసిల్దార్లలు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు