బ్యాంకు లాకర్‌లో 18 తులాల బంగారం మాయం!

14-11-2026 | 04:20pm

13 ఏళ్లుగా భద్రపరిచిన ఆభరణాలు ఏమయ్యాయి..?

వృద్ధ దంపతులకు బ్యాంకు అధికారుల నుంచి బెదిరింపులా..?

పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ ఆవేదన..

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు

సీసీ కెమెరాలు, లాకర్ రికార్డులతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

ఆలేరు,(విజయక్రాంతి): బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన 18 తులాల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district) ఆలేరులో కలకలం రేపుతోంది. గుండ్లగూడెంకు చెందిన అంగరేకుల కృష్ణమూర్తి, లక్ష్మీబాయి దంపతులు 2013లో ఆలేరులోని ఎస్‌బీఐ బ్యాంకు లాకర్‌(SBI Bank Locker)లో తమ బంగారు ఆభరణాలను భద్రపరిచారు. అయితే 2026 అక్టోబర్ 12న లాకర్ తెరిచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వృద్ధ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై బ్యాంకు అధికారులను ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని, మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ప్రశ్నిస్తే బ్యాంకు అధికారులే ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని, బ్యాంకు అధికారులను అడిగితే తమకేమీ సంబంధం లేదని సమాధానమిస్తున్నారని వాపోయారు. 

ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌ను నిలదీసినప్పుడు ఆభరణాలను మీరే తీసుకెళ్లారని తమను బెదిరించే విధంగా మాట్లాడారని వృద్ధ దంపతులు ఆరోపించారు. తమ జీవితకాల కష్టార్జితంతో కూడబెట్టుకున్న 18 తులాల బంగారం మాయమైనా పట్టించుకునే వారు లేకపోవడం దారుణమని కన్నీటిపర్యంతమయ్యారు.

లాకర్ రికార్డులు, బ్యాంకు ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులెవరో గుర్తించి తమకు న్యాయం చేయాలని కృష్ణమూర్తి, లక్ష్మీబాయి దంపతులు విలేకరుల సమావేశంలో అధికారులను వేడుకున్నారు. బ్యాంకు లాకర్‌లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు